కరోనా రిలీఫ్ ఫండ్‌కి ఏపీ మంత్రి భారీ విరాళం
లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలు, సామాన్యులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వాలకు అండగా పలువురు తమవంతు
కరోనా వైరస్ (కోవిడ్ 19) నియంత్రణకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ముందుకు కదులుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలు, సామాన్యులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వాలకు అండగా పలువురు తమవంతు సహాయాన్ని అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు భారీ విరాళం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తోన్న కరోనా వైరస్ నియంత్రణకు వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నివారణ చర్యలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళంగా అందజేస్తామని ప్రకటించారు. కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో తరిమికొట్టేందుకే వైసీపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రజలందరూ సహకరించి కచ్చితంగా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, లేకపోతే ఇళ్లకే పరిమితం కావాలని మంత్రి సూచించారు.