న‌డిరోడ్డుపై మృత‌దేహం..గ్రామంలోకి అనుమ‌తించ‌ని స్థానికులు, బంధువులు

విజయవాడ లో అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తిని అర్ధరాత్రి ఓ ప్రైవేటు అంబులెన్స్ లో తీసుకుని వచ్చి రోడ్డుపై వదిలేసిన కథనం వెలుగు చూసింది. మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న మృతుని భార్య, కుమారుడు..

న‌డిరోడ్డుపై మృత‌దేహం..గ్రామంలోకి అనుమ‌తించ‌ని స్థానికులు, బంధువులు
Follow us

|

Updated on: Apr 22, 2020 | 2:22 PM

కంటికి క‌నిపించ‌ని కోవిడ్ భూతం ప్ర‌పంచ దేశాల మ‌ధ్య అడ్డుక‌ట్ట వేసింది. మ‌నిషిని మ‌నిషినీ దూరం చేసింది. చివ‌ర‌కు త‌ల్లిబిడ్డ‌ల‌ను, భార్య భ‌ర్త‌ల‌ను కూడా దూరం చేసింది. ఒక‌రి మంచి చెడులు ఇంకొక‌రు చూడ‌కుండా అంద‌రి చేతులు క‌ట్టేసి నిస్స‌హాయుల‌ను చేసింది. ఈ త‌రుణంలో దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌ర‌ణించిన వారిది మాత్రం అత్యంత ద‌య‌నీయ స్థితి. దీన‌స్థితిలో ప‌డివున్న మృత‌దేహం ఒక‌టి కృష్ణా జిల్లా మోపిదేవి లంక గ్రామంలో మృతదేహం కలకలం రేపింది.  వివ‌రాల్లోకి వెళితే…
విజయవాడ లో అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తిని అర్ధరాత్రి ఓ ప్రైవేటు అంబులెన్స్ లో తీసుకుని వచ్చి రోడ్డుపై వదిలేసిన కథనం వెలుగు చూసింది. మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న మృతుని భార్య, కుమారుడుని చూసిన వారంద‌రినీ కంట‌త‌డిపెట్టించింది. ఇటువంటి స్థితిలో మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకు రావడంతో గ్రామ‌స్తులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.
మోపిదేవి మండలం మోపిదేవిలంక గ్రామానికి చెందిన కారుమూరి చైనా వెంకటేశ్వరరావు వృత్తిరీత్యా పెదపులిపాక లో భార్య, కుమారుడితో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో విజయవాడ ఆసుపత్రిలో మందులు వాడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ప్రవేటు అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకుని తెల్లవారుజామున 3 గంటల సమయంలో మోపిదేవి లంక గ్రామానికి వచ్చి, రోడ్డుపై దింపారు. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న మృతుని సోదరుడు మృతదేహాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి నిరాకరించారు. ఎక్కడో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తిని అర్ధరాత్రి మా గ్రామానికి ఎందుకు తెచ్చారంటూ అడ్డుకున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
మృతుని బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేయాలా లేక విజయవాడ కు మృతదేహాన్ని తిరిగి పంపించాలా అని పోలీసులు తల పట్టుకుని కూర్చున్నారు.