JEE NEET Merge: ‘జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల విలీనం ప్రతిపాదన మాత్రమే..! రెండేళ్ల వరకు ఆ భయం లేదు’
ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ టెస్టులను సీయూఈటీ-యూజీలో విలీనం చేసే దిశగా యూజీసీ ప్రతిపాదనలకు కేంద్రం బ్రేక్ వేసింది. జేఈఈ మెయిన్, నీట్‌లను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టులో విలీనం చేసే ప్రక్రియ మరో రెండేళ్ల వరకు ఉండబోదని..
Will JEE and NEET be Merged with CUET in 2023: ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ టెస్టులను సీయూఈటీ-యూజీ (Common University Entrance Test-Undergraduate)లో విలీనం చేసే దిశగా యూజీసీ ప్రతిపాదనలకు కేంద్రం బ్రేక్ వేసింది. జేఈఈ మెయిన్, నీట్‌లను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టులో విలీనం చేసే ప్రక్రియ మరో రెండేళ్ల వరకు ఉండబోదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లను కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)తో విలీనం చేసే ఆలోచన లేదని, ప్రస్తుతం పరీక్షల విలీనం కేవలం “కాన్సెప్ట్” మాత్రమేనని, తుది నిర్ణయం కాదని, విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు సూత్రప్రాయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నీట్, జేఈఈలను సీయూఈటీలో విలీనం చేసే ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని’ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
కాగా జేఈఈ మెయిన్, నీట్ ప్రవేశ పరీక్షల్లో ఒకే సబ్జెక్టులు ఉన్నందున ప్రత్యేకంగా జేఈఈ మెయిన్, నీట్ పరీక్షల నిర్వహణ అవసరం లేదని, వాటినీ సెంట్రల్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న సీయూఈటీలో విలీనం చేస్తామని యూజీసీ ఛైర్మన్ ఎం జగదీశ్‌కుమార్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధ్యాసాధ్యాలు, విధివిధానాలపై నిపుణుల కమిటీని నియమిస్తామని కూడా అప్పట్లో ఆయన అన్నారు. ‘ఒకే దేశం-ఒకే పరీక్ష’ నినాదంతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలకు వేరువేరుగా ఎంట్రన్స్ టెస్టులు రాయకుండా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆయా సబ్జెక్టుల్లో ప్రవేశాలు పొందేలా కొత్త పరీక్ష విధానం ఉండబోతుందని యూజీసీ ఛైర్మన్ తెలిపారు. దీంతో జాతీయస్థాయిలో భారీగా డిమాండ్ ఉన్న ఈ పరీక్షల విలీన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఏడాది నిర్వహించిన సీయూఈటీ-యూజీ 2022 పరీక్ష పలుచోట్ల పరీక్ష నిర్వహణ గందరగోళంగా జరిగింది. దీంతో పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ చేతకాని తనంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్, నీట్‌లను విలీనం చేసి అకస్మాత్తుగా కొత్త విధానం ప్రవేశపెడితే ఇంకెంత గందరగోళానికి దారితీస్తోందోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి చేసిన ప్రకటనతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.