TSPSC Exam Dates: నోటిఫికేషన్లు వెలువడి ఏడాది గడుస్తోన్న పరీక్షల తేదీలు ప్రకటించని టీఎస్పీయస్సీ
సర్కార్ కొలువుల కోసం నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలిచ్చి నెలలు గడుస్తున్నా అర్హత పరీక్షలు ఇంకా నిర్వహించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడి ఏడాది గడిచింది. ఈ ఏడాది జనవరిలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రం కూడా..
హైదరాబాద్, సెప్టెంబర్ 14: సర్కార్ కొలువుల కోసం నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలిచ్చి నెలలు గడుస్తున్నా అర్హత పరీక్షలు ఇంకా నిర్వహించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడి ఏడాది గడిచింది. ఈ ఏడాది జనవరిలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రం కూడా లీకవడంతో తర్వాత కమిషన్ డీఏఓ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పింది కూడా. కానీ ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇక గ్రూప్ 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలై కూడా దాదాపుగా ఏడాది కావొస్తోంది. వీటితో పాటు పలు పోటీ పరీక్షల నిర్వహణపై స్పష్టత కొరవడింది.
దీంతో ఈ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అసలు ఈ పరీక్షలు జరుగుతాయా అనే సందేహంలో గందరగోళానికి గురవుతున్నారు. పరీక్ష తేదీని ప్రకటిస్తే అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ఓ ప్రణాళికను రూపొందించుకుని.. దాని ప్రకారంగా సన్నద్ధమవుతారు. ఈ రోజుల్లో ప్రభుత్వ కొలువు సాధించాలంటే కఠోర సన్నద్ధత అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. కొందరైతే చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ సన్నద్ధత మవుతున్నారు. సర్కార్ కొలువు సాధించాలనే తపనతో నిరుద్యోగులు సన్నద్ధమవుతుంటే పరీక్షల తేదీలను ప్రకటించకుండా టీఎస్పీయస్సీ కాలయాపన చేస్తోంది. ఇక ఈ నెలలో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించిన కమిషన్.. ఫిజికల్ డైరెక్టర్లు, జూనియర్ లెక్చరర్ పోస్టులకు సెప్టెంబర్ 29వ తేదీ వరకు జరుగుతున్నాయి.
రేపే తెలంగాణ టెట్ 2023 పరీక్ష
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష (టెట్) సెప్టెంబరు 15వ తేదీన జరగనుంది. రేపు ఉదయం పేపర్-1కు 2,69,557 మంది హాజరుకానుండగా.. మధ్యాహ్నం జరిగే పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం జరిగే పేపర్ 1 పరీక్షకు 1,139 పరీక్ష కేంద్రాలు, మధ్యాహ్నం జరిగే పేపర్ 2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టెట్ అభ్యర్ధుల కోసం తెలంగాణ ఆర్టీసీ శుక్రవారం నాడు స్పెషల్ బస్సులు నడపనుంది. పరీక్ష నిర్వహణపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం జారీ చేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.