TS SSC March 2024 Exam Fee: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే
పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ప్రకటన వెలువరించారు. రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 8 వరకు ఫీజు చెల్లించవచ్చని గడువు ఇచ్చారు. విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఫీజు చెల్లింవచ్చని, ఇదే చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు. కాగా పదో తరగతి పబ్లిక పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వరకు జరగనున్న..

హైదరాబాద్, జనవరి 4: పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ప్రకటన వెలువరించారు. రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 8 వరకు ఫీజు చెల్లించవచ్చని గడువు ఇచ్చారు. విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఫీజు చెల్లింవచ్చని, ఇదే చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు. కాగా పదో తరగతి పబ్లిక పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వరకు జరగనున్న సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షల కోసం ఇప్పటికే 5.03 లక్షల మంది ఫీజు చెల్లించారు.
ఫీజు చెల్లింపు వివరాలు..
6 సబ్జెక్టులకు పరీక్ష రాయాలనుకునే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.110గా నిర్ణయించారు. 3 సబ్జెక్టులకు మించి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించారు. ఒకేషనల్ విద్యార్థులు రూ.60 పరీక్ష ఫీజు చెల్లించాలి. కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి పట్టణాల్లో రూ.24 వేలకు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలకు మించకుండా ఉన్న వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. లేదా 2.5 ఎకరాల సాగు భూమి, 5 ఎకరాల బంజరు భూమి ఉన్నవారికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్‌లో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపుకు ఇంటర్ బోర్డు కసరత్తులు
విద్యార్థులు, జూనియర్ కాలేజీ యాజమాన్యాల సౌకర్యార్థం ఇంటర్‌బోర్డు మరో అడుగు ముందుకు వేసింది. పరీక్షల ఫీజులను సైతం విద్యార్థులు ఆన్‌లైన్‌లో చెల్లించేలా కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం కాలేజీల అనుబంధ గుర్తింపు, ఇతర అనుమతులను ఆన్‌లైన్ ద్వారానే బోర్డు మంజూరు చేస్తోంది. వీటితోపాటు ఫీజు చెల్లింపులు కూడా ఆన్‌లైన్ విధానంలో జరిగేలా ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మైగ్రేషన్, ఎలిజిబిలిటీ, ఈక్విలెన్స్, డూప్లికేట్ మార్కుల మెమో లాంటి 18 రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. పరీక్షల ఫీజును మాత్రం ఆన్‌లైన్‌లో చెల్లించే వెసులుబాటు లేకపోవటంతో వాటిని ఆయా కాలేజీలకు నేరుగా చెల్లించాల్సి వచ్చేది. దీనిని ఆసరాగా తీసుకుని పలు ప్రైవేట్ కాలేజీలు పరీక్షల ఫీజు పేరిట చెల్లించాల్సిన మొత్తానికి మూడు నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నట్లు తరచూ ఇంటర్‌బోర్డుకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు విద్యార్థులే స్వయంగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.