TGPSC Group 1: ‘అభ్యంతరాల స్వీకరణ తర్వాతే గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించాం.. ఈ దశలో కోర్టు జోక్యం తగదు’ హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు
తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. 2022లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ జి దామోదర్‌రెడ్డితోపాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ పిటీషన్లను దాఖలు చేశారు..
హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. 2022లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ జి దామోదర్‌రెడ్డితోపాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ పిటీషన్లను దాఖలు చేశారు. అంతేకాకుండా తాజాగా నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు.
విచారణ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది కీలక విషయాలను ధర్యాసనానికి తెలియజేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని, వాటిని ఆయా సబ్జెక్ట్‌ల వారీగా నిపుణుల కమిటీకి పంపి, వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ హైకోర్టుకు నివేదించింది. మెయిన్స్ క్వాలిఫై అయిన వారికి త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి, టీజీపీఎస్సీ తరఫున ఎం రాంగోపాల్‌రావులు వాదనలు వినిపించారు.
గ్రూప్ 1 పరీక్షలు రాసిన 3 లక్షల మంది నుంచి ప్రిలిమ్స్ కీపై భౌతికంగా 721, ఆన్‌లైన్ ద్వారా 6,470 అభ్యంతరాలు వచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి, కొన్ని సిఫార్సులు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుని రెండు ప్రశ్నలను తొలగించి కీని విడుదల చేశామని వివరించారు. ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురిలో ఒక్కరే కమిషన్‌కు అభ్యంతరాలు తెలియజేసినట్లు తెలిపారు. మిగిలినవారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా కోర్టును ఆశ్రయించారన్నారు. రెండోసారి నోటిఫికేషన్ జారీని సవాల్ చేసిన అభ్యర్థితో పాటు కీని సవాల్ చేసిన పిటిషనర్లలో ముగ్గురు మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు వెల్లడించారు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులైనట్లు కాదన్నారు. పరీక్షలను నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని, ఈ పిటిషన్‌లను కొట్టివేయాలని న్యాయమూర్తిని కోరారు. అయితే గురువారం కోర్టులో వాదనలు పూర్తికాకపోవడంతో తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేశారు. ఈ రోజు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు అంతిమ నిర్ణయం ఏం చెబుతుందనేది వేచి చూడాలి.