AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Inter Exams: సమీపిస్తున్న ఇంటర్‌ పరీక్షలు.. 90 రోజుల ప్రణాళికతో రంగంలోకి ఇంటర్ బోర్డు!

మరో మూడు నెలల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేయడానికి ఇంటర్ బోర్డు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది..

TG Inter Exams: సమీపిస్తున్న ఇంటర్‌ పరీక్షలు.. 90 రోజుల ప్రణాళికతో రంగంలోకి ఇంటర్ బోర్డు!
TG Inter Exams
Srilakshmi C
|

Updated on: Dec 05, 2024 | 8:31 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి చదువుతున్న ఇంటర్‌ విద్యార్ధులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంటర్‌ విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్‌ వార్షిక పరీక్షలకు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇంటర్‌ బోర్డు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కృష్ణ ఆదిత్య ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 428 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా.. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇంటర్‌ విద్యాశాఖ జిల్లా, నోడల్‌ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జూనియర్, సీనియర్‌ ఇంటర్‌లకు కలిపి మొత్తం 1.80 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే, రాష్ట్రంలోని పలు కాలేజీల్లో విద్యార్ధుల హాజరు సగం మందికి కూడా మించిలేదు.

ఈ క్రమంలో గత మూడేళ్ల గణాంకాలను కృష్ణ ఆదిత్య పరిశీలించారు. 2023లో ఫస్టియర్‌లో 40 శాతం మంది విద్యార్ధులు మాత్రమే పాసైనట్లు గుర్తించారు. దీంతో ఈ ఏడాది ఇంటర్‌ విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు గైర్హాజరవుతున్న విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు, వారి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు. రెండు, మూడుసార్లు పిలిచినా రాకుంటే వారి పేర్లను తొలగించాలని సూచించారు. చదువులో ప్రతి విద్యార్థి స్థాయిని అంచనా వేయాలని, వెనకబడిన వారిని గుర్తించి, ఎన్ని ప్రత్యేక తరగతులు తీసుకుంటే మిగిలిన విద్యార్థులతో సమానంగా తయారవుతారో అంచనా వేయాలని సూచించారు. డిసెంబరు నెలాఖరుకు సిలబస్‌ పూర్తి చేయాలి. ఈ మేరకు లెక్చరర్లు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే సబ్జెక్టుల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 90 రోజులు అమలు చేయాలని పేర్కొన్నారు. అందుకు కళాశాల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకొని నివేదిక పంపాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఒక మహిళా, ఒక పురుష అధ్యాపకులను కౌన్సెలర్లుగా నియమించాలి. ఎవరైనా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటే కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. టెలీమానస్‌ టోల్‌ఫ్రీ నంబరులో అందుబాటులో ఉండే సైకాలజిస్టుల సేవలు పొందాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.