CAPF Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. సీఏపీఎఫ్ బలగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలు: కేంద్రం వెల్లడి
కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఖాళీల వివరాలను తెలిపారు..
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కేంద్ర సాయుధ బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్ (AR)లో లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గత ఐదేళ్లలో దాదాపు 71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో బుధవారం వెల్లడించారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్, ఏఆర్ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్ ఏర్పాటు, కొత్త పోస్టులను సృష్టించడం వంటి వాటివల్ల ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా ఖాళీలు పరిశీలిస్తే.. అక్టోబర్ 30 నాటికి సీఏపీఎఫ్, ఏఆర్‌లో మొత్తంగా 1,00,204 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అందులో అత్యధికంగా సీఆర్‌పీఎఫ్‌లో 33,730 పోస్టులు, సీఐఎస్ఎఫ్‌లో 31,782 పోస్టులు, బీఎస్‌ఎఫ్‌లో 12,808 పోస్టులు, ఐటీబీపీలో 9,861 పోస్టులు, ఎస్ఎస్‌బీలో 8,646 పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో 3377 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ద్వారా ఈ ఖాళీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు వైద్య పరీక్షలకు సంబంధించి సమయాన్ని తగ్గించడం, కానిస్టేబుల్ జీడీ కోసం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల కటాఫ్ మార్కులను తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇక కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేసే సిబ్బంది శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీఏపీఎఫ్ సిబ్బందికి ఏడాదిలో 100 రోజులు వారంతా కుటుంబంతో గడిపేలా మంత్రిత్వశాఖ కృషిచేస్తోందని తెలిపారు. 2020 నుంచి 2024 అక్టోబర్ వరకు 42,797 మంది సీఏపీఎఫ్, ఏఆర్ సిబ్బంది 100 రోజుల సెలవులు వినియోగించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
TGPSC: టీజీపీఎస్సీ ఇంజినీర్ల జాబితా విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
హైదరాబాద్: వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ఈ క్రమంలో ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ డిసెంబరు 3న తెలిపారు. ఎలక్ట్రికల్ ఇంజినీర్లుగా 50 మంది, మెకానికల్ ఇంజినీర్లుగా 97 మంది ఎంపికయ్యారని తెలిపారు.