TG ICET 2025 Notification: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి షెడ్యూల్ ఇదే!
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదల చేశారు..

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సహకారంతో నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి సంయుక్తంగా గురువారం (మార్చి 6) విడుదల చేశారు. అనంతరం ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. మార్చి 10వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయన్నారు. ఇక జూన్ 8, 9 తేదీల్లో నాలుగు విడతలుగా ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ జూన్ 21న విడుదల చేస్తామన్నారు. ‘కీ’ పై అభ్యంతరాలను జూన్ 22 నుంచి 26 వరకు స్వీకరిస్తామని, అనంతరం ఫైనల్ కీ రూపొందించి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు.
ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. గతంలో తెలంగాణ వ్యాప్తంగా ఎంజీయూ ఆధ్వర్యంలో TG PECET, TG EdCET పరీక్షలు జరిగాయి. అయితే ఈసారి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఐసెట్ 2025 నిర్వహణ బాధ్యతలు ఎంజీయూ అప్పగించారు. కాగా ఈసారి ఐసెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 4 షిఫ్టులలో 2 రోజులపాటు పరీక్ష ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
తెలంగాణఐసెట్ 2025 పూర్తి షెడ్యూల్ ఇదే..
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ తేదీలు: మార్చి 10 నుంచి మే 3 వరకు
- రూ 250 అపరాధ రుసుముతో చివరి తేదీ: మే 17 వరకు
- రూ 500 అపరాధ రుసుముతో చివరి తేదీ: మే 26 వరకు
- దరఖాస్తుల సవరణ తేదీలు: మే 16 నుంచి 20 వరకు
- ఐసెట్ 2025 పరీక్ష తేదీ: జూన్ 8, 9
- ప్రాథమిక కీ విడుదల తేదీ: జూన్ 21న
- ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ తేదీలు: జూన్ 22 నుంచి 26 వరకు
- ఐసెట్ 2025 ఫలితాల విడుదల తేదీ: జులై 7
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




