TS Panchayat Secretary Jobs: 6603 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి.. మిలిగిన వారికి త్వరలోనే
తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దాదాపు 6603 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం (సెప్టెంబర్ 16) ఉత్తర్వులు జారీ చేసింది. క్రమబద్ధీకరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఈ పోస్టుల్లో నియమించాలని సర్కార్ ఆదేశించింది. వీటితో పాటు మరో 3065 పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటిని కూడా క్రమబద్ధీకరించే కార్యదర్శులను ఈ పోస్టుల్లో..
హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దాదాపు 6603 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం (సెప్టెంబర్ 16) ఉత్తర్వులు జారీ చేసింది. క్రమబద్ధీకరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఈ పోస్టుల్లో నియమించాలని సర్కార్ ఆదేశించింది. వీటితో పాటు మరో 3065 పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటిని కూడా క్రమబద్ధీకరించే కార్యదర్శులను ఈ పోస్టుల్లో నియమించనున్నట్లు తెల్పింది. జేపీఎస్ పోస్టులకు నెలకు రూ.28,719 వేతనం ఇస్తుండగా.. ప్రస్తుతం నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు నెల వేతనం రూ.24,280 నుంచి 72,850 వరకు వేతనం ఇవ్వనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 9355 మంది జేపీఎస్‌లు పనిచేస్తున్నారు. వారందరినీ క్రమబద్ధీకరించి నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నాలుగేళ్ల సర్వీస్, అనుభవం, పనితీరు ప్రాతిపదికగా అర్హులను గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు గతంలోనే ఆదేశాలిచ్చారు. దీంతో మొత్తం 6,616 మందిని గుర్తించారు. వీరందరినీ క్రమబద్ధీకరణకు అర్హులుగా తెల్పుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ కొత్తగా 6,603 నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మంజూరు పోస్టుల కంటే 13 మంది అర్హులు ఎక్కువగా ఉన్నారు. వీరిని కూడా శాఖాపరంగా సర్దుబాటు చేయాలని ఆదేశించింది.
మిగిలిన వారికి ఎప్పుడు..?
నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9355 మంది జేపీఎస్‌లు పనిచేస్తున్నారు. వీరిలో వెయ్యి మంది ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సేవలందిస్తున్నారు. మరో 1739 మంది డీఎస్సీ ద్వారా ఎంపికయిన వారు ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది ఎంపికైన వెంటనే విధుల్లో చేరకుండా పలు కారణాల రిత్యా కొలువులో చేరకుండా జాప్యం చేశారు. దీంతో వీరికి నాలుగేళ్ల సర్వీసు నిండలేదు. ఫలితంగా గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు వారి పేర్లు ఎంపిక చేయలేదు. ప్రస్తుతం 6603 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను క్రమబద్ధీకరించనుంది. మిగిలిన 3065 ఖాళీ జేపీఎస్ పోస్టులకు కూడా త్వరలో క్రమబద్ధీకరణ ద్వారా నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందే వీలుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.