AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించిన తెలంగాణ సర్కార్‌! 35 ఏళ్ల తర్వాత..

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో12,755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కొద్ది రోజుల ముందు సర్కార్‌ కీలక ప్రకటన వెలువరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా..

Telangana: ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించిన తెలంగాణ సర్కార్‌! 35 ఏళ్ల తర్వాత..
Private Practice
Srilakshmi C
|

Updated on: Jun 08, 2022 | 5:56 PM

Share

Telangana Govt banned government doctors from doing private practice: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో12,755 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కొద్ది రోజుల ముందు సర్కార్‌ కీలక ప్రకటన వెలువరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొత్తగా నియమితులయ్యే డాక్టర్లు ఇకపై ప్రైవేటు ప్రాక్టీసు చేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జూన్‌ 7 (మంగళవారం)న ఉత్తర్వులు జారీచేసింది. బోధనాసుపత్రుల సేవా నిబంధనలను అనుసరించి.. నేరుగా నియమితులైన క్లినికల్, నాన్‌ క్లినికల్‌ విభాగాలకు చెందిన అందరు స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు వైద్యులు, బోధనేతర విభాగం నుంచి బదిలీపై వచ్చిన వైద్యనిపుణులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం పరిధిలోకి వస్తారని వైద్య శాఖ పేర్కొంది.

ఎంబీబీఎస్‌ అర్హతతో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులో చేరే డాక్టర్లకు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ విభాగాల పరిధిలో స్పెషలిస్టు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లుగా నియమితులు కానున్న వారికి కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు. ఐతే ఇప్పటికే డాక్టర్లుగా పనిచేస్తున్నవారికి ఈ నిబంధనలు వర్తించవన్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్యులుగా నియమితులయ్యే డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు పెట్టడాన్ని నిషేధిస్తూ స్పష్టతనిచ్చింది. జీతాల పెంపుపై మాత్రం ఉత్తర్వుల్లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్‌ పెట్టడాన్ని నిషేధించడం ఇదే తొలిసారి కాదు. 1980లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధాన్ని విధించింది. 35 ఏళ్ల తర్వాత మళ్లీ నిషేధాన్ని ప్రవేశపెట్టారు. ఐతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దీనికి సవరణలు చేశారు.

ఇవి కూడా చదవండి

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు ప్రతి విభాగానికి సంబంధించిన విద్యార్హతలను తాజా ఉత్తర్వుల్లో పొందుపర్చారు. ఈ సవరణల్లో ముఖ్యాంశాలేవంటే.. గతంలో ఎండీ, ఎంఎస్‌ పీజీ పూర్తి చేసినవారిని నేరుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నియమితులయ్యేవారు. ఐతే ప్రస్తుత సవరణ ఉత్తర్వుల ప్రకారం.. పీజీ వైద్యవిద్య పూర్తి చేసిన అనంతరం తప్పనిసరిగా ఒక ఏడాది పాటు సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే డీఎన్‌బీ పీజీ కోర్సులకు సంబంధించి కూడా ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు. 500 ఆ పైన పడకలున్న ఆసుపత్రిలో గనుక డీఎన్‌బీ పీజీ కోర్సు చేస్తే ఒక ఏడాది సీనియర్‌ రెసిడెంట్‌గా చేయాలి. ఒకవేళ 500 లోపు పడకలున్న ఆసుపత్రిలో గనుక చేస్తే రెండేళ్ల పాటు సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేసి ఉండాలి.

అప్పుడే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత లభిస్తుంది. నిబంధనల ప్రకారం.. ప్రస్తుత ప్రభుత్వ వైద్యులు తమ క్లినిక్‌లో లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో సంప్రదింపులు మరియు మందులను సూచించడానికి మాత్రమే అనుమతించబడతారు. వారు ఆపరేషన్లు చేయడానికి లేదా స్వంతగా ఆసుపత్రిని నిర్వహించడానికి అనుమతి ఉండదు. తెలంగాణలోనే కాకుండా దాదాపు 12 నుంచి 13 రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఈ విధమైన నిషేధం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

ఆందోళనలో యువ వైద్యులు తెలంగాణ ప్రభుత్వ ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం విధించడంపై కొత్తగా ఉద్యోగాల్లోచేరాలనుకుంటున్న యువ వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ప్రకటించబోయే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని, తద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలని ఎదురు చూస్తున్న కొత్త వైద్యులకు ఈ ప్రకటన నిరుత్సాహాన్ని కలిగించింది. దీంతో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వంటి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌లతో సమానంగా తమ జీతాలను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.