TG ECET and LAWCET 2026 Schedule: ఈసెట్, లాసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 9 నుంచే దరఖాస్తులు ప్రారంభం
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈసెట్, లాసెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీ విడుదల చేసింది. ఈ మేరకు దరఖాస్తు తేదీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం తెలంగాణ లాసెట్ దరఖాస్తులు..

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈసెట్, లాసెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీ విడుదల చేసింది. ఈ మేరకు దరఖాస్తు తేదీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం తెలంగాణ లాసెట్ దరఖాస్తులు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన లాసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఆలస్య రుసుములేకుండా లాసెట్ దరఖాస్తులు ఏప్రిల్ 10వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఇంటర్ పాసైన విద్యార్ధులు లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా లాసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ అర్హత కలిగిన వారికి ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, డిగ్రీ విద్యార్హత కలిగిన వారికి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ పూర్తయిన వారికి రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్ పరీక్ష ఉంటుంది.
ఇక తెలంగాణ ఈసెట్ నోటిఫికేషన్ 2026 ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమవుతాయి. ఎలాంటి దరఖాస్తు రుసుములేకుండా ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) పూర్తి చేసిన విద్యార్ధులకు ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఈసారి ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ గత ఏడాది కంటే దాదాపు 20 రోజుల ముందుగా ప్రారంభమవుతుంది. దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్షా కేంద్రాలను పెంచడంపై నిర్ణయం తీసుకుంటారు.
మరోవైపు లాసెట్‌కు ఏటా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ సారి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్ష కేంద్రాల పెంపుపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు విద్యార్ధులు తమ ఆసక్తి మేరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




