TGPSC Group 1 Exam: టీజీపీఎస్సీ గ్రూప్ 1 రద్దుకు సుప్రీం నో.. రెండు పిటిషన్లు కొట్టివేత
తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ తోపాటు, మెయిన్స్ పరీక్ష రద్దుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన రెండు పిటీషన్లను ధర్మాసనం కొట్టివేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మెయిన్స్ ఫలితాలు వెలువడనుండగా.. ఈ దశలో స్టే ఇవ్వలేమని ధర్మాసనం తీర్పు ఇచ్చింది..
హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే జూన్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ‘కీ’లో వచ్చిన 14 తప్పులను స్వతంత్ర నిపుణుల బృందం ఖరారు చేయాలని, ఆ తర్వాతే మెయిన్స్ నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మరికొంత మంది మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటీషన్లను విచారించిన అత్యున్న ధర్మాసనం రెండు ఎస్‌ఎల్‌పీలను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం డిసెంబరు 6న విచారించి, పిటిషన్లను కొట్టివేసింది. విచారణ సమయంలో అక్టోబరు 18న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా తొలుత పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గురుకృష్ణకుమార్ వాదనలు వినిపిస్తూ… టీజీఎస్‌పీఎస్సీ జూన్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలోని 41వ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో తప్పులున్నట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇందులో కింద పేర్కొన్న చట్టాలు, రూల్స్‌ని వాటిని పాస్ చేసిన సంవత్సరంతో జత చేయండి అనే ప్రశ్నకు అటవీ సంరక్షణ చట్టం, జాతీయ హరిత ట్రైబ్యునల్ చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, హజార్డస్ వేస్ట్ మేనేజ్‌మెంట్ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్‌బౌండరీ మూవ్‌మెంట్ ఫస్ట్ అమెండ్‌మెంట్ రూల్స్ గురించి ఇచ్చారని పేర్కొన్నారు. ఇంతలో జస్టిస్ పీఎస్‌నరసింహ జోక్యం చేసుకుంటూ.. ఈ పరీక్షలో నేనైతే కచ్చితంగా ఫెయిల్ అవుతానని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
అనంతరం గురుకృష్ణకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రశ్నల ద్వారా అభ్యర్ధుల జ్ఞాపకశక్తిని పరీక్షించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అయితే మొదట మీరే సమాధానం చెప్పడంటూ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఏ సంవత్సరంలో పాస్ చేశారో చెప్పండి? అని టీజీఎస్‌పీఎస్సీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని అడిగారు. దీనిని ఆయన స్పందిస్తూ.. తాను మొత్తం 13 ప్రశ్నలను మాత్రమే చూశానని, అందులో ఒక్కదానికి మాత్రమే సమాధానం తెలుసని నవ్వుతూ బదులిచ్చారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు పాసైందని జస్టిస్ నరసింహ మరో ప్రశ్న సంధించగా… పిటిషనర్ తరఫు న్యాయవాది 1972 అని చెప్పారు. హజార్డస్‌వేస్ట్ అమెండ్‌మెంట్ రూల్స్ ఏ సంవత్సరం వచ్చాయని మరో ప్రశ్న వేశారు. ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం లేదన్నారు. అందుకు జస్టిస్ పీఎస్‌నరసింహ సమాధానం చెప్పకుండా భారతీయ సమాజంగా మనం పరీక్ష ప్రక్రియను తప్పుల్లేకుండా తీర్చిదిద్దామా అని ఎదురు ప్రశ్నించారు.
ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరకు.. హైకోర్టు తీర్పు ప్రకారంగానే గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించని కేవలం ఏడుగురు అభ్యర్థుల కోసం ప్రిలిమ్స్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. సుమారు 30 వేల మంది అభ్యర్థులపై ప్రభావం చూపే గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయలేమని, అభ్యర్థులు ఇప్పటికే మెయిన్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.. ఈ దశలో స్టే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.