TS TET 2022: తెలంగాణ టెట్ సిల‌బ‌స్‌ మార్పు అనివార్యమా? ఆ నిబంధన ఎత్తివేయకపోతే..

సంబంధంలేని సబ్జెక్టుల నుంచి అధిక సంఖ్యలో ప్రశ్నలు అడిగే ఎలా? డిగ్రీలో 50 శాతం మార్కుల అర్హతతో టెట్‌ రాసేదెలా..

TS TET 2022: తెలంగాణ టెట్ సిల‌బ‌స్‌ మార్పు అనివార్యమా? ఆ నిబంధన ఎత్తివేయకపోతే..
Ts Tet 2022
Follow us

|

Updated on: Apr 03, 2022 | 8:55 AM

TS TET 2022 Exam Pattern: సంబంధంలేని సబ్జెక్టుల నుంచి అధిక సంఖ్యలో ప్రశ్నలు అడిగే ఎలా? భవిష్యత్తులో తెలుగు సబ్జెక్టును బోధించాల్సిన ఉపాధ్యాయులకు గణితం, సాంఘికశాస్త్రాల్లో పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారా? జీవశాస్త్రం బోధించేందుకు నియమించేవారికి గణితంలో అధిక ప్రశ్నలు ఇస్తే ఎలా? ఇలా.. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022)కు సంబంధించి పలువురు అభ్యర్థులు విద్యాశాఖను ప్రశ్నిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలిస్తున్నారు. రోజురోజుకు టెట్‌ చుట్టూ అభ్యంతరాలు పెరిగిపోతుండటం…డిమాండ్లు అధికం అవుతుండటంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ‘హిందీ విద్వాన్‌ లేదా ప్రవీణా లేదా మధ్యమా, విశారద్‌ తదితర కోర్సులు హిందీ డిగ్రీతో సమానమని, అందుకే 2017 జులై టెట్‌ రాసేందుకు అర్హత ఇచ్చారని, ఈసారి ఎందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఆ విద్యార్హతలు కనిపించడం లేదని హిందీ సేవాసదన్‌ మహా విద్యాలయ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గైబువల్లి ప్రశ్నిస్తున్నారు. ఆ విద్యార్హతతో గురుకులాల్లో కూడా ఉద్యోగాలిచ్చారని, ఈసారి కూడా అవకాశం ఇవ్వాలని, లేదంటే 35 వేల మంది నష్టపోతారని ఆయన తెలిపారు. దీనిపై విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలిచ్చినట్లు చెప్పారు. ‘బయాలజీ విద్యార్థులకు కూడా గణితం, భౌతికశాస్త్రం నుంచి 35 – 40 మార్కుల ప్రశ్నలు ఇస్తున్నారు. దాన్ని మార్పుచేసి ఆ మార్కులను జీవశాస్త్రం నుంచి ఇవ్వాలి’ అని బయాలజీ అభ్యర్థి, టెట్‌ లోపాలపై పోరాడుతున్న వరంగల్‌ జిల్లాకు చెందిన బచ్చు రాజేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు.

డిగ్రీలో 50 శాతం మార్కుల అర్హతతో టెట్‌ రాసేదెలా? తెలంగాణ రాష్ట్రంలో 2016, 2017 టెట్‌ నిర్వహణ సందర్భంగా జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉంటేనే పరీక్ష రాయడానికి అర్హులన్న నిబంధన విధించారు. ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. అయితే 2011, 2012, 2013లో టెట్‌ రాయడానికి డిగ్రీలో 45 శాతమున్నా అవకాశమిచ్చారు. టెట్‌ ధ్రువపత్రానికి జీవితకాల గుర్తింపు ఇచ్చినందున ఇప్పుడు తమకు డిగ్రీలో 50 శాతం మార్కులు లేవని, టెట్‌ రాసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టెట్‌ తర్వాత నిర్వహించే TRTకి కూడా ఇదే నిబంధన విధిస్తే తాము నష్టపోతామని అభ్యర్థి జోగుపర్తి అశోక్‌ తెలిపారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

తెలంగాణ ఓపెన్‌ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా ఇంటర్‌ చదివిన విద్యార్థులను కరోనా కారణంగా 2020లో కనీస మార్కులతో పాస్‌ చేశారు. అధిక మార్కులు తెచ్చుకుందామంటే మళ్లీ పరీక్షలు నిర్వహించలేదు. వారు డీఈడీలో చేరారు. ఇప్పుడు రెండో ఏడాది చదువుతున్నారు. ప్రభుత్వం డీఈడీ రెండో సంవత్సరం విద్యార్థులకూ టెట్‌ రాసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే తమకు ఇంటర్‌లో 50 శాతం లేదా 45 శాతం మార్కులు లేవని, ఆ నిబంధన తొలగించి టెట్‌ రాసేందుకు అవకాశం ఇవ్వాలని టాస్‌ విద్యార్థులు కోరుతున్నారు.

హిందీ భాషా పండిట్‌ పరీక్ష విధానంతోనూ పేచీనే! 150 మార్కుల టెట్‌ ప్రశ్నపత్రంలో తెలుగు, హిందీ భాషా పండితులకు కూడా 60 మార్కుల ప్రశ్నలు వారు చదవని సబ్జెక్టుల నుంచి ఇస్తున్నారు. గణితం నుంచి 30, సాంఘికశాస్త్రం నుంచి మరో 30 ప్రశ్నలున్నాయి. దీంతో సిలబస్‌ మార్చాలని కొందరు అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు సంఘాల నేతలు జగదీశ్‌, అబ్దుల్లా తదితరులు పలువురికి వినతిపత్రాలు ఇచ్చారు. ఏపీలో భాషా పండితుల కోసం ప్రత్యేకంగా పేపర్‌ – 3 నిర్వహిస్తున్నారని, అందులో ఎంచుకున్న భాషపై 60 ప్రశ్నలు ఉంటాయని, ఇక్కడా అదేవిధంగా చేయాలని వారు సూచిస్తున్నారు. దీనిపై రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతుండటంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం.

పేపర్‌ 1 కు బీఈడీ అభ్యర్ధుల పోటీ.. మరోవైపు టెట్‌ పేపర్‌ 1కు బీఈడీ అభ్యర్ధులకు కూడా అవకాశం ఇవ్వడంతో దరఖాస్తుల వెళ్లువ మొదలైంది. కేవలం వారంలోనే లక్షకుపైగా దరఖాస్తులు చేసుకున్నారు. కాగా గతంలో ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT)గా నియమితులవ్వాలంటే పేపర్‌ 1లో అర్హత సాధించాలి. అందుకు డీఈడీ పూర్తి చేసని వారే అర్హులు. ఐతే ఈసారి బీఈడీ చదివని వారు కూడా పేపర్‌ 1 రాయడానికి అర్హులేనని ఎన్‌సీటీఈ (జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో పేపర్1కు దరఖాస్తుల వెళ్లువ ప్రారంభమైంది. కాగా ఏప్రిల్ 11కు టెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు.

Also Read:

BECIL Recruitment 2022: టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో..బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

Latest Articles