JEE Main 2025 Guidelines: మీరూ జేఈఈ మెయిన్ పరీక్ష రాయబోతున్నారా? పరీక్ష రోజు వీటిని మర్చిపోకండి
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో బీటెక్, బీఈ, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

హైదరాబాద్, జనవరి 20: దేశంలోని ప్రతిష్టాతమ్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ -2025 తొలి సెషన్ పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. ఇక జనవరి 30వ తేదీన మధ్యాహ్నం సెషన్‌లో పేపర్ 2 బీఆర్క్ పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఇక ఇప్పటికే జనవరి 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేసింది. మిగిలిన పరీక్షలకు ఆయా తేదీలకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులను వెల్లడించనుంది. కాగా దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలకు 14 లక్షల మంది విద్యార్ధులు హాజరవుతున్న సంగతి తెలిసిందే.
జేఈఈ మెయిన్ 2025 పరీక్ష రాసేవారికి కొన్ని ముఖ్య సూచనలు..
- జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్న విద్యార్థులందరూ అందులో ఎన్‌టీఏ పొందుపర్చిన నియమ, నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. మీకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందుగానే చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
- ఉదయం మొదటి షిఫ్ట్ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి ఉదయం సెషన్ పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 1 గంటలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లను మూసివేస్తారు.
- జేఈఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నీట్ తరహాలో ఎన్టీయే కఠిన నిబంధనలు అమలు చేయనుంది. పరీక్ష రాసే విద్యార్థులందరూ సాధారణ వ్రస్తాలను ధరించి రావాలి. కాళ్లకు షూ ధరించకూడదు. చెప్పులు మాత్రమే ధరించాలని ఎన్టీయే స్పష్టంగా పేర్కొంది.
- డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్‌కార్డు కింది భాగంలో ఒక బాక్సు ఉంటుంది. అందులో కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోను తప్పనిసరిగా అతికించాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు అప్‌లోడ్ చేసిన తరహా ఫొటోనే తప్పనిసరిగా అతికించాల్సి ఉంటుంది. అలాగే ఆ పక్కనే ఉన్న మరో బాక్సులో సంబంధిత విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దాని పక్కనున్న మూడో బాక్సులో పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్ సమక్షంలో మరోమారు సంతకం చేయాల్సి ఉంటుంది.
- పరీక్ష కేంద్రంలోకి విద్యార్ధులు అడ్మిట్‌కార్డుతో పాటు అటెండెన్స్ షీట్‌పై అతికించేందుకు మరో పాస్‌పోర్ట్ సైజు ఫోటోను కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పరీక్ష రాసే విద్యార్ధుల బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా నమోదు చేస్తారు. విద్యార్ధులు తమతోపాటు బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను.. ఆధార్, పాన్ వంటి ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ కార్డును తమతో పాటు అభ్యర్ధులు తీసుకెళ్లాలి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.
