AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు ఆదా చేసేందుకు.. రూ.15000 కోట్లతో 59 కొత్త ఓడలు! ఎలాగంటే?

భారత్ ముడి చమురు, ఇంధన రవాణాకు విదేశీ షిప్పింగ్‌పై ఏటా రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు IOC, BPCL, HPCL, SCI కలిసి కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇది 59 నౌకలను కొనుగోలు చేయడానికి రూ.15,000-17,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది.

డబ్బు ఆదా చేసేందుకు.. రూ.15000 కోట్లతో 59 కొత్త ఓడలు! ఎలాగంటే?
Oil Shipping
SN Pasha
|

Updated on: Feb 26, 2026 | 4:00 PM

Share

భారత్‌ ప్రతి సంవత్సరం ముడి చమురు, ఇంధన రవాణా కోసం విదేశీ షిప్పింగ్ సంస్థలపై భారీగా ఆధారపడుతోంది. ఈ లాజిస్టిక్స్‌కు సుమారు రూ.6 లక్షల కోట్ల వరకు వ్యయం అవుతుండటం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు కలిసి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ప్రత్యేక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.

ప్రతిపాదిత కంపెనీలో షిప్పింగ్ కార్పొరేషన్‌కు ప్రధాన వాటా ఉండనుంది. మొత్తం వాటాల్లో 50 శాతం వాటాను ఈ సంస్థ దక్కించుకోనుంది. మూడు ప్రభుత్వ చమురు సంస్థలు కలిపి 35 శాతం వాటాను కలిగి ఉంటాయి. మిగిలిన 15 శాతం మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ చేతిలో ఉంటుంది. సముద్ర రంగ అభివృద్ధి లక్ష్యంగా రూ.25,000 కోట్ల కార్పస్‌తో ఏర్పాటైన ఈ ఫండ్ ఈ ప్రాజెక్టుకు ఆర్థిక బలం అందించనుంది.

ఈ మాస్టర్ ప్లాన్ కింద భారీ స్థాయిలో నౌకల కొనుగోలు చేపట్టాలని యోచిస్తున్నారు. మొత్తం 59 నౌకలను కొనుగోలు చేయాలని ప్రణాళికలో ఉంది. వీటిలో పెద్ద ముడి చమురు వాహకాలు, గ్యాస్ క్యారియర్లు, ఆఫ్‌షోర్ నౌకలు ఉంటాయి. ఈ మొత్తం కొనుగోలు ప్రక్రియకు సుమారు రూ.15,000 నుంచి రూ.17,000 కోట్ల వరకు పెట్టుబడి అవసరమని అంచనా.

ఈ భాగస్వామ్యంలో ప్రతి సంస్థకు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. షిప్పింగ్ కార్పొరేషన్ సాంకేతిక, కార్యాచరణ, నియంత్రణ నైపుణ్యాన్ని అందిస్తుంది. చమురు కంపెనీలు దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా నిరంతర సరుకు రవాణాను హామీ ఇస్తాయి. నౌకల నిర్వహణను షిప్పింగ్ కార్పొరేషన్ చేపట్టి స్థిర నిర్వహణ రుసుము పొందుతుంది. అధికారుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం అమల్లోకి వస్తే విదేశీ జెండా నౌకల అద్దెపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. విదేశీ మారకద్రవ్య ప్రవాహం బయటకు వెళ్లడాన్ని నియంత్రించడంతో పాటు దేశ ఇంధన భద్రత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us