NEET PG 2024 Exam: మరికాసేపట్లో నీట్ పీజీ పరీక్ష ప్రారంభం.. ఈ తప్పులు చేశారో ఎగ్జాం హాల్లోకి నో ఎంట్రీ!
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పీజీ 2024 పరీక్ష మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ రోజు (ఆగస్టు 11న) పరీక్ష మొత్తం రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు..
న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పీజీ 2024 పరీక్ష మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ రోజు (ఆగస్టు 11న) పరీక్ష మొత్తం రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది. పరీక్షకు అరగంట ముందు నుంచే అంటే 7 గంటలకు, మధ్యాహ్నం 1.30లకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, పేజర్లు, కాలిక్యులేటర్లు, పెన్ డ్రైవ్‌లు, ట్యాబ్లెట్‌లతో సహా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అలాగే చేతులకు గోరింటాకు, టాటూలు వంటివి ఉన్నా నో ఎంట్రీ అని తేల్చి చెప్పారు. గతంలో జూన్ 23వ తేదీన నీట్ పీజీ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. నీట్ యూజీ వివాదం కారణంగా ఈ పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నీ ఏర్పాట్లు చేసింది. క్వశ్చన్ పేపర్ల లీకేజీ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్ణయించింది. పరీక్షకు సరిగ్గా 2 గంటల ముందు మాత్రమే క్వశ్చన్ పేపర్‌ను సిద్ధం చేసి పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంటాయి. అభ్యర్థులు సరైన సమాధానాన్ని ఎంచుకోవల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 25 శాతం నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్రతి సెషన్‌లో పరీక్ష 3 గంటల 30 నిమిషాల పాటు జరుగుతుంది. నీట్ పీజీ పరీక్ష దేశవ్యాప్తంగా 185 పరీక్ష నగరాల్లో 500 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో చేరేందుకు MBBS డిగ్రీ అర్హత కలిగిన వారికి NEET-PG నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.