TG CPGET 2024 Schedule: సీపీగెట్ ఫలితాల్లో అమ్మాయిల సత్తా.. రేపట్నుంచి తొలి విడత కౌన్సెలింగ్ షురూ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్ తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్)లో 94.57 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 64,765 మంది పరీక్షలు రాయగా, వారిలో 61,246 మంది కనీస మార్కులు సాధించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి..
హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల పరిధిలో ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్ తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్)లో 94.57 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 64,765 మంది పరీక్షలు రాయగా, వారిలో 61,246 మంది కనీస మార్కులు సాధించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో అమ్మాయిలు 40,677 అంటే 66.41 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందటం విశేషం.
రాష్ట్రంలో మొత్తం 278 కాలేజీల్లో 42,192 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆర్ లింబాద్రి తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్ల కంటే ఉత్తీర్ణులైన అభ్యర్ధులు అధికంగా ఉన్నా చివరకు ఆయా కోర్సుల్లో చేరేవారు 25 వేలకు మించడం లేదని ఆయన అన్నారు. యేటా డిగ్రీలో సుమారు 2.25 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారని, పీజీలో అతి తక్కువ మంది చేరుతున్నారని అన్నారు. పీజీ కోర్సులకు ప్రత్యామ్నాయంగా ఎంసీఏ, ఎంబీఏ, బీఎడ్, బీపీఎడ్ తదితర కోర్సుల్లో చేరుతున్నారన్నారు. ఈ క్రమంలో డిగ్రీలో పాసైన వారంతా ఆ తర్వాత ఎటువైపు వెళ్తున్నారన్న అంశంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
తొలి విడత సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 12వ తేదీన ప్రారంభమై సెప్టెంబరు 9తో ముగుస్తుంది. రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 15న మొదలవనుంది. ఆగస్టు 12 నుంచి 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 27 నుంచి 30 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సెప్టెంబర్ 4వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. 9వ తేదీ లోపు సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ప్రవేశాలు పొందిన విద్యార్ధుల కుటుంబ వార్షిక ఆదాయం సర్టిఫికెట్ సమర్పిస్తేనే.. ఆయా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉంటుందని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. కాగా సీపీగెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని 297 పీజీ కళాశాలల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.