Bagless Days to Students: స్కూల్ విద్యార్ధులకు10 రోజుల బ్యాగ్‌లెస్ డేస్.. ఏయే తరగతులకంటే!
పాఠశాలల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి, అభ్యసనను ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది. విద్యా సంవత్సరంలో 10 రోజులు బ్యాగ్‌లెస్ డేస్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌సీఈఆర్‌టీ సోమవారం మార్గదర్శకాలు..
న్యూఢిల్లీ, జులై 30: పాఠశాలల్లో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి, అభ్యసనను ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది. విద్యా సంవత్సరంలో 10 రోజులు బ్యాగ్‌లెస్ డేస్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌సీఈఆర్‌టీ సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని ద్వారా ఆరు నుంచి 8వ తరగతి వరకు విద్యార్ధులు అందరూ 10 రోజులపాటు బ్యాగ్‌లెస్ పీరియడ్‌లలో పాల్గొనవల్సి ఉంటుంది. NEP 2020 నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా ఈ మార్గదర్శకాలు విడుదల చేశారు. 10 బ్యాగ్‌లెస్ రోజులను బోధన-అభ్యాస ప్రక్రియలో అంతర్భాగంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
కేవలం పుస్తకాల బరువును తగ్గించడం మాత్రమే కాకుండ.. పుస్తకాల ద్వారానే జ్ఞానసముపార్జన జరగాలనే విధానానికి భిన్నంగా విద్యార్ధులను అనుభవపూర్వక పనివిధానంలో భాగస్వాములను చేస్తారు. ఆయా రోజుల్లో విద్యార్థులు తమ కిష్టమైన పనులు చేయవచ్చు. అంటే కార్పెంటరీ, ఎలక్ట్రిక్, తోటపని, కుండల తయారీ, వంటలు, గాలిపటాల తయారీ, వాటి ఎగరవేత, పుస్తకాల ప్రదర్శన ఇలా తమకిష్టమైన పనులన్నీ చేయవచ్చు. ఈ పది రోజులలో చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు, స్థానిక కళాకారులతో సమావేశాలు, ఉన్నత విద్యా సంస్థలను సందర్శించడం వంటి వాటి ద్వారా పిల్లలకు పాఠశాల వెలుపల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలియజేశాయలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
వీటితోపాటు విద్యార్థులందరూ ఈ పది రోజుల బ్యాగ్‌లెస్ పీరియడ్‌లలో వడ్రంగులు, తోటమాలి, కుమ్మరులు, కళాకారులు మొదలైన స్థానిక వృత్తి నిపుణుల వద్ద శిక్షణ పొందవచ్చు. దీని వల్ల పుస్తక జ్ఞానం, అనువర్తన మధ్య సరిహద్దులు తగ్గడమే కాకుండా, పని ప్రదేశాలలో నైపుణ్యాలను పిల్లలకు తెలియజేయవచ్చు. తద్వారా భవిష్యత్తులో కెరీర్ మార్గాన్ని నిర్ణయించుకోవడంలో విద్యార్ధులకు సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ బ్యాగ్ రహిత సీరియడ్స్ విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా అమలు చేయవచ్చని తెలిపింది.