DSC Free Coaching: డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన
త్వరలో వెలువడనున్న డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ డీఎస్సీ కొత్త సిలబస్ కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేశారు..
అమరావతి, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డీఎస్సీ హడావిడా నెలకొంది. నిరుద్యోగులు సర్కార్ కొలువు దక్కించుకునేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరికొందరు వేలకు వేలు చెల్లించి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. కోచింగ్‌కు వెళ్లే స్థోమత లేనివారు మాత్రం ఇంట్లోనే సొంతంగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. అయితే ఇటువంటి నిరుపేద నిరుద్యోగుకుల ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతోంది ఏపీ సర్కార్. డీఎస్సీ ఉచిత శిక్షణ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వినిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ బుధవారం (నవంబర్ 27) ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనారిటీల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో డీఎస్సీకి హాజరయ్యే మైనారిటీ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ముస్లిం, క్రిస్టియన్ (బీసీ-సీ), సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్సీలు తదితర మతాలకు చెందిన అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రైవేట్ సంస్థల ద్వారా శిక్షణ అందిస్తామని వివరించారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. విజయవాడలోని భవానీపురంలో ఉన్న మైనారిటీ డైరెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు 086629 70567 ఫోన్ నంబరు ద్వారా సంప్రందించవచ్చని సూచించారు.
ఏపీ మెగా డీఎస్సీ 2024 కొత్త సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా దాదాపు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన కొంత ఆలస్యం అవుతుందని ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 వరకు పోస్టులు ఉండనున్నాయి. నోటిఫికేషన్‌లో వచ్చేలోపు ప్రిపరేషన్ సాగించి సిద్ధంగా ఉండాలని విద్యాశాఖ పేర్కొంది. మరో 2, 3 నెలల్లో డీఎస్సీ ప్రకటన జారీ చేసే అవకావం ఉంది.