Telangana: మార్పు మంచిదేనా.? పదోతరగతి పరీక్ష విధానం మార్పుపై ఏమంటున్నారు..

పదో తరగతి పరీక్ష విధానంలో మార్పులు తీసుకొస్తూ తెలగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై భిన్నవాదనాలు వినిపిస్తున్నాయి. ఇంటర్నల్‌ మార్కులను తొలగించి, వంద మార్కులకు పరీక్షలు నిర్వహించడం మొదలు. గ్రేడింగ్ విధానాన్ని తీసివేయాలని నిర్ణయించడం వంటి విషయాలపై విద్యా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి..

Telangana: మార్పు మంచిదేనా.? పదోతరగతి పరీక్ష విధానం మార్పుపై ఏమంటున్నారు..
TG SSC
Follow us
Vidyasagar Gunti

| Edited By: Narender Vaitla

Updated on: Nov 29, 2024 | 3:30 PM

తెలంగాణలో విద్యాశాఖ పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ అకాడమిక్‌ ఇయర్‌ నుంచి ఇంటర్నల్ మార్కులను తొలగిస్తూ ప్రభుత్వం ఉన్నపలంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థులకు తిరిగి మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు.

గ్రేడింగ్ విధానం రద్దు చేస్తూ.. ఇంటర్నల్ మార్కులను సైతం ఎత్తివేశారు. 100 మార్కులకు ఎస్.ఎస్.సీ పరీక్షలు ఈ ఏడాది నుంచే నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అకాడమిక్ ఇయర్ మధ్యలో హఠాత్తుగా పరీక్షల విధానాన్ని మార్చడంపై పలువురు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో ఇంటర్నల్ విధానంలో ఇచ్చే 20 మార్కులను ఎత్తివేసి.. 100 మార్కులకు ఫైనల్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఫలితాలను గ్రేడ్ రూపంలో ఇవ్వగా ఇకపై 600 కు ఎన్ని మార్కుల వచ్చాయో విడుదల చేస్తారు.

దీంతో పాత పద్ధతిలోనే మళ్లీ టెన్త్ ఎగ్జామ్ ప్యాట్రన్‌ ఉండనుంది. ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ వంద మార్కుల మోడల్ పేపర్లను మాత్రం రిలీజ్ చేయలేదు. దీంతో ఏ సెక్షన్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి.. ఎన్ని మార్కులకు ప్రశ్నలు ఉంటాయన్న అవగాహన విద్యార్థులకు లేకుండా పోయింది. సాధారణంగా ఇలాంటి కీలక మార్పులు అకడామిక్ ప్రారంభంలో వెల్లడించాలి కానీ మధ్యలో మార్చడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఉన్న ఇంటర్నల్ మార్కుల విధానంతో ఆయా పాఠశాలల్లో నచ్చిన విధంగా మార్కులు వేసుకుంటున్నారని అభిప్రాయపడుతోంది.

దీంతో పాటు గ్రేడింగ్ విధానంతో బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల్లో అడ్మిషన్‌ల ఎంపిక ఇబ్బంది అవుతుందని భావించింది. పోస్టల్ డిపార్టుమెంట్‌లో 10వ తరగతి అర్హతతో ఎంపిక చేసే ఉద్యోగ నియామకాల్లో మార్కుల ప్రామాణికం కావడంతో గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికినట్లు చెబుతోంది. మరోవైపు పరీక్షల 24 పేజీల ఆన్సర్ సింగిల్ బుక్ లెట్ విధానాన్ని కూడా ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టింది. గత విధానంలో నాలుగు పేజీల బుక్ లెట్ తర్వాత అదనంగా పేపర్లు ఇచ్చే వారు దీనివల్ల పేపర్లను విడిగి సర్క్యూలేట్ చేసే ఛాన్స్, మిస్ అయ్యే అవకాశం ఉందని 24 పేజీల సింగిల్ బుక్ లెట్ ను తీసుకొచ్చారు.

మార్కుల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం ప్రైవేటు విద్యాసంస్థలకు వెచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. గతంలో మార్కుల ప్రకటనతో విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారనే గ్రేడింగ్ విధానం తెచ్చారని అంటున్నారు. ఇప్పడు మళ్లీ విద్యార్థులను ఒత్తిడిలోకి తీసుకెళ్లేలా నిర్ణయం ఉందని విమర్శిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను ఏ విధంగా కట్టడి చేస్తారో.. స్టూడెంట్స్ ఒత్తిడికి గురికాకుండా ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ప్రభుత్వం బయటపెట్టాలని కోరుతున్నారు. మొత్తంమీద పదో తరగతి పరీక్షల విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్న కన్ఫూజన్ ను ప్రభుత్వం తొలగించాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..