10th Class Exams 2026: టెన్త్ స్టూడెంట్స్‌కు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు.. టాపర్స్‌గా నిలవాలంటే ఇలా చదవండి
శ్రద్ధగా చదవాలి.. మననం చేసుకోవాలి.. సరైన విశ్రాంతి తీసుకోవాలి అని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ టెన్త్ విద్యార్థులకు సూచించారు. బుధవారం అవనిగడ్డ విద్యానికేతన్ స్కూల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన..

అవనిగడ్డ, డిసెంబర్ 24: శ్రద్ధగా చదవాలి.. మననం చేసుకోవాలి.. సరైన విశ్రాంతి తీసుకోవాలి అని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ టెన్త్ విద్యార్థులకు సూచించారు. బుధవారం అవనిగడ్డ విద్యానికేతన్ స్కూల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. తమ స్వరాష్ట్రం కర్ణాటకలో తాను టెన్త్ పరీక్షల్లో మొదటి స్థానం సాధించేందుకు అనుసరించిన స్వీయ అనుభవం చెప్పి స్ఫూర్తిని ఇచ్చారు. విద్యార్థులు నిద్రాహారాలు మాని చదివితే బుర్రకు ఎక్కదన్నారు. మెదడుకు, శరీరానికి రోజుకు తగిన విశ్రాంతినిచ్చి చదివితే గుర్తుండిపోయేలా చదివే శక్తి లభిస్తుందన్నారు. చదివే ముందు ఐదు నిమిషాలు ప్రాణాయామం, చదివిన తరువాత మననం చేసుకోవటం ముఖ్యం అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలనే పట్టుదలకు తోడు గ్రూప్ స్టడీ ఇంపార్టెంట్ అన్నారు. విద్యార్థులు తమకు పట్టున్న సబ్జెక్ట్ గురించి ఆ సబ్జెక్టులో బలహీనంగా ఉన్న విద్యార్థికి వివరించే ప్రయత్నం చేస్తే ఇద్దరికీ పాఠం బాగా గుర్తుంటుందన్నారు.
ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. కృష్ణాజిల్లా టెన్త్ ఫలితాల్లో స్టేట్ టాప్ 5లో రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రతి హైస్కూల్లో టాపర్స్ 590/600 మార్కులు సాధించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది టెన్త్ ఫలితాల్లో నియోజకవర్గం ఉత్తమ స్థానంలో నిలిచినప్పటికి, తప్పిన కొద్దిమంది విద్యార్థులు ఎక్కువ సబ్జెక్టుల్లో తప్పిన అంశాన్ని గమనించి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు తమలోని భయాన్ని పూర్తిగా విడనాడి పట్టుదల, క్రమశిక్షణతో చదివి నియోజకవర్గానికి జిల్లాలో, రాష్ట్రంలో మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పురిటిగడ్డ హైస్కూల్ ప్లస్ తెలుగు అధ్యాపకురాలు ఓలేటి ఉమా సరస్వతి తమ హైస్కూల్ విద్యార్థులు రచించిన కవితలతో ముద్రించిన తేనె చినుకులు పుస్తకాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, డీఈఓ ఆవిష్కరించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రంగాల్లో నిపుణులతో అవగాహన, శిక్షణ ఇచ్చారు. అతిధులను చైర్మన్ లంకమ్మ ప్రసాద్ ఘనంగా సత్కరించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




