JEE Main 2026 Application correction: మరికొన్ని గంటల్లో ముగుస్తున్న జేఈఈ మెయిన్ 2026 కరెక్షన్ విండో.. ఇదే చివరి ఛాన్స్!
NTA JEE Mains 2026 Session 1 correction window last date: 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ 2026 తొలి విడత రిజిస్ట్రేషన్లు నవంబర్ 27వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేసిన దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎన్టీయే అవకాశం..

హైదరాబాద్, డిసెంబర్ 2: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ 2026 తొలి విడత రిజిస్ట్రేషన్లు నవంబర్ 27వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేసిన దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎన్టీయే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు ఉంటే డిసెంబర్ 2వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు సవరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెసులుబాటు కల్పించింది. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మరో అవకాశం ఇవ్వబోమని, అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
అలాగే జేఈఈ మెయిన్ సెషన్ 1 దరఖాస్తు సమయంలో తప్పుగా నమోదుచేసిన వివరాల సవరణకు కేవలం ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. అందువల్ల అభ్యర్ధులు జాగ్రత్తగా తమ వివరాలు సరిచేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులో అభ్యర్థి మొబైల్ నంబర్, ఈ-మెయిల్, అడ్రస్ (శాశ్వత/ప్రస్తుత), ఎమర్జెన్సీ కాంటాక్టు వివరాలు, అభ్యర్థి ఫొటోను మార్చడానికి మాత్రం అవకాశం ఉండదు. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం ఉంటుంది. పదో తరగతి, 12వ తరగతి సంబంధిత వివరాలు, పాన్ కార్డు నంబర్, పరీక్ష రాయాలనుకొనే నగరం, పరీక్ష మాధ్యమం, అభ్యర్థి పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ/పీడబ్ల్యూడీ, సంతకం, అభ్యర్ధి ఇతర గుర్తింపు వివరాలను మార్చడానికి అవకాశం ఉంటుంది.
ఇక జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి 30వ తేదీ మధ్య దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు జనవరి 2026 మొదటి వారంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇక అడ్మిట్ కార్డులు జనవరి 2026 మూడో వారంలో విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేస్తారు. ఈ మేరకు షెడ్యూల ప్రకారం అభ్యర్ధులు తమ సన్నద్ధతను కొనసాగించవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అలాగే జేఈఈ పరీక్షలకు కాలిక్యులేటర్ తీసుకొచ్చేందుకు అనుమతి ఉండదు. జేఈఈ స్కోర్ ద్వారా ఎన్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐ వంటి ప్రతిష్టాత్మక ఇంజినిరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ఇన్‌స్టిట్యూట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ మెయిన్-2026 సెషన్ 1 కరెక్షన్ విండో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




