AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Degree Internships: ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి.. ప్రతి నెలా స్టైపెండ్‌!

ఎన్ని డిగ్రీలు చేతికి వచ్చినా నచ్చిన కొలువు దక్కాలంటే నైపుణ్యాలున్న వారికి ద్వారాలు తెరచుకుంటాయి. ఇది నేటి జాబ్‌ మార్కెట్‌ పోకడ. కంపెనీల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని తెగేసి చెబుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులు, నిరుద్యోగుల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్కు బాటలు వేస్తున్నాయి. ఈ క్రమంలో

Degree Internships: ఇక డిగ్రీ విద్యార్ధులకూ ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి.. ప్రతి నెలా స్టైపెండ్‌!
Degree Internships In Telangana
Srilakshmi C
|

Updated on: Jan 11, 2026 | 7:34 AM

Share

హైదరాబాద్‌, జనవరి 11: డిగ్రీ విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్‌ అమలుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో పలు దఫాలుగా సమీక్షలు చేశారు. అందుకే విద్యాశాఖ ఈ దిశగా రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేసేందుకు అడుగు వేస్తుంది. డిగ్రీ మూడో సంవత్సరంలో ఒక సెమిస్టర్‌కి ఈ సౌకర్యం కల్పించనుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ లేదా అప్రెంటిస్‌షిప్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఇంటర్న్‌షిప్‌ అంటే?

ఇంటర్న్‌షిప్‌ అనేది విద్యార్థులు వివిధ పరిశ్రమలు, కార్యాలయాల్లో కొన్నాళ్లు ఉద్యోగిగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో అక్కడ శిక్షణ అందిస్తారు. అయితే ఉచితంగా ఇంటర్న్‌షిప్‌ చేయాలంటే విద్యార్ధులు ఆసక్తి చూపకపోవచ్చని భావించిన ప్రభుత్వం.. విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లించేందుకు సిద్ధమవుతుంది. ఈ ఇంటర్న్‌షిప్‌ కాలానికి నెల వారీగా స్టైపెండ్‌ చెల్లించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. యూనివర్సిటీలు తమ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లిస్తాయి. ఇందులో ఉన్నత విద్యామండలి, ఆయా పరిశ్రమలు కూడా తమ వంతుగా కొంతమేర చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ లేదా అప్రెంటిస్‌షిప్‌ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, వివిధ నియంత్రణ సంస్థలైన ఏఐసీటీఈ, యూజీసీ చెబుతూనే ఉన్నాయి. ఏఐసీటీఈ దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ని కూడా ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు బీటెక్‌ విద్యార్థులకే ఇంటర్న్‌షిప్‌ పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. విద్యాసంస్థలతో పరిశ్రమలకు అనుసంధానం కాకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఇంటర్న్‌షిప్‌ కొన్ని కాలేజీలకే పరిమితమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్‌ సిలబస్‌ను అప్‌డేట్‌ చేసి, బీటెక్‌ విద్య స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఇది క్షేత్ర స్థాయిలో అసలు ఎంత వరకు విజయం సాధిస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అధ్యాపకుల జీతాలు చెల్లించేందుకే నానా కష్టాలు పడుతున్న వర్సిటీలు డిగ్రీ విద్యార్థులకు స్టైపెండ్‌ ఎలా చెల్లించగలమని వైస్‌ ఛాన్స్‌లర్లు తర్జనభర్జనలు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.