Work From Home: ఆఫీసులకు వస్తేనే ప్రమోషన్స్.. ఉద్యోగులకు తేల్చి చెప్పిన దిగ్గజ ఐటీ కంపెనీ.
కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడ్డట్లే సాఫ్ట్‌వేర్ రంగంపై కూడా ప్రభావం పడింది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును కంపెనీలు కల్పించాయి. ఉద్యోగులు సైతం ఇంటి నుంచి పని చేయడానికి మొగ్గు చూపించారు. దీంతో కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికే..

కరోనా కారణంగా అన్ని రంగాలపై ప్రభావం పడ్డట్లే సాఫ్ట్‌వేర్ రంగంపై కూడా ప్రభావం పడింది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును కంపెనీలు కల్పించాయి. ఉద్యోగులు సైతం ఇంటి నుంచి పని చేయడానికి మొగ్గు చూపించారు. దీంతో కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికే ఆసక్తి చూపించారు. కంపెనీలు ఆఫీసుకు రావాలని పిలుపునిచ్చినా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. అయితే ఉద్యోగులను ఎలాగైనా ఆఫీసుకు రప్పించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు చర్యలు ప్రారంభించాయి.
ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎమ్ ఉద్యోగులకు కీలక సమాచారం అందచేసింది. ఆఫీసులకు రాని వారికి ప్రమోషన్స్ ఉండవనే విషయాన్ని తేల్చిచెప్పింది. ఆఫీసులకు రాని వారు కెరీర్ అవకాశాలను కోల్పోతారని ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ తెలిపారు. టీం లీడర్ అవ్వాలనుకునే వారు మేనేజర్ స్థాయికి చేరుకోవడం ఇబ్బందని స్పష్టం చేశారు. రిమోట్ వర్కింగ్ ఉద్యోగుల కెరీర్ ఎదుగుదలను దెబ్బతీస్తుందన్న ఆయన.. కెరీర్‌లో ఎదగాలనుకునే వారు ఆఫీస్ నుంచే పనిచేయాలని సూచించారు.
టీం సభ్యులను నేరుగా సంప్రదించాల్సి ఉంటుందని, ఎక్కడో కూర్చుని పనిచేస్తే జట్టులను నడిపించడం కష్టమని అరవింద్ అభిప్రాయపడ్డారు. అలాగే జట్టు సభ్యులు ఒకరికొకరు నేరుగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యమని, జట్టుగా పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. మరి ఐబీఎమ్ తీసుకున్న ఈ నిర్ణయంతోనైనా ఉద్యోగులు ఆఫీసు బాట పడుతారో చూడాలి.




మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..