Work From Home: వర్క్ వ్రమ్ హోమ్ విషయంలో హెచ్‌సీఎల్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు ఆదేశాలు.
అయితే కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికాయి. ఉద్యోగులను తిరిగి కంపెనీలకు రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేస్తూ వచ్చాయి. ఇదిలా ఉంటే చాలా రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డ ఉద్యోగులు మాత్రం ఇందుకు ససేమిరా...

కరోనా మహమ్మారి కారణంగా వర్క్ వ్రమ్ హోమ్ విధానానికి కంపెనీలు పెద్ద ఎత్తున మొగ్గు చూపాయి. అప్పటి వరకు ఈ విధానాన్ని అమలు చేయని కంపెనీలు సైతం అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కరోనా కారణంగా ఎక్కువగా లాభ పడిన రంగం ఏదైనా ఉందంటే అది ఐటీ రంగమేనని చెప్పాలి. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడంతో కంపెనీలకు పెద్ద ఎత్తున కలిసొచ్చింది.
అయితే కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికాయి. ఉద్యోగులను తిరిగి కంపెనీలకు రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేస్తూ వచ్చాయి. ఇదిలా ఉంటే చాలా రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డ ఉద్యోగులు మాత్రం ఇందుకు ససేమిరా అంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు కఠినంగా వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులుకు రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే పనిలో పడ్డాయి ఐటీ కంపెనీలు. టీసీఎస్ ఇప్పటికే ఈ విషయంలో ముందు వరుసలో ఉండగా మిగతా కంపెనీలు సైతం ఇదే బాట పట్టాయి. తాజాగా ఇదే విషయమై హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.
డీఎఫ్‌ఎస్ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు మెమో పంపించారు. నిర్దేశించిన కార్యాలయాలకు హాజరుకావాలని, కనీసం మూడు రోజులు చొప్పున పనిచేయాలని అందులో తెలిపింది. ఉద్యోగుల రోస్టర్ వివరాలను మేనేజర్లు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ప్రస్తుతం డీఎఫ్‌ఎస్ డివిజన్‌లో 80 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. శిక్షణలో ఉన్న ఫ్రెషర్లు మాత్రం వారానికి ఐదు రోజులూ కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని ఐటీ కంపెనీ తేల్చి చెప్పేసింది.
అయితే కంపెనీ ప్రకటించిన మార్గదర్శకాలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. అనధికారిక గైర్హాజరీగా పరిగణిస్తామని కంపెనీ హెచ్చరించింది. అలాంటివారిపై కంపెనీ పాలసీకి అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే వర్క్ వ్రమ్ హోమ్ విధానం ద్వారా పని నాణ్యతపై ప్రభావం పడుతోందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందిగా తేల్చి చెబుతున్నాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..




