Jobs: వచ్చే పదేళ్లలో ఈ రంగంలో కొలువుల జాతర.. ఏకంగా 9 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!
రానున్న పదేళ్ల కాలంలో అంతర్జాతీయ పర్యాటక, ఆతిథ్య రంగంలో ఏకంగా 9.1 కోట్ల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. 'Future of the Travel and Tourism Workforce’ పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో..

హైదరాబాద్, అక్టోబర్ 7: వచ్చే దశాబ్ధ కాలంలో అంతర్జాతీయ పర్యాటక, ఆతిథ్య రంగంలో ఏకంగా 9.1 కోట్ల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. ‘Future of the Travel and Tourism Workforce’ పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో వేగంగా పెరుగుతున్న జనాభా, నిర్మాణాత్మక సవాళ్లను పరిష్కరించకపోతే 4.3 కోట్లకు పైగా శ్రామిక శక్తి కొరతను సృష్టించవచ్చని హెచ్చరించింది. రోమ్‌లో జరిగిన 25వ WTTC గ్లోబల్ సమ్మిట్‌లో ఈ నివేదికను విడుదల చేశారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగాలలో ఒకదానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని, పొంచి ఉన్న సవాళ్లను ఇందులో హైలైట్ చేశారు. 2024 సంవత్సరం చారిత్రాత్మక సంవత్సరంగా నిలిచింది. ఎందుకంటే ప్రపంచ డిమాండ్ మహమ్మారికి ముందు స్థాయిలను దాటి పర్యాటక, ఆతిథ్య రంగానికి అంతర్జాతీయంగా పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ రంగం ద్వారా GDP 8.5% పెరిగి USD 10.9 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది 2019 స్థాయిల కంటే 6% ఎక్కువ. ట్రావెల్ ప్రొవైడర్లు 20.7 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టించారు. ఈ రంగంలో మొత్తం ప్రపంచ ఉపాధిని 35.7 కోట్లకు చేరిందని వెల్లడించింది. ఇందులో 20 దేశాలపై దృష్టిపెట్టింది. పర్యాటక, ఆతిథ్య పరిశ్రమ ఇబ్బందులపై ప్రభుత్వాలతో కలిసి డబ్ల్యూటీటీసీ పనిచేస్తోంది.
ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తలలో ఒకటిగా పర్యాటక రంగం కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను అందించనుందని WTTC తాత్కాలిక CEO గ్లోరియా గువేరా అన్నారు. అంతర్జాతీయంగా వచ్చే ప్రతి మూడు కొత్త ఉద్యోగాల్లో ఒకటి ఈ రంగంలోనే ఉంటుందని తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




