మూటలు మోశాడు.. కట్టెలు కొట్టాడు.. చివరికి UPSC కొట్టి IAS అయ్యాడు!
కష్టాలు ఎదురైతే వెనక్కి తగ్గకుండా.. లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాడితే విజయం సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి ఐఏఎస్ అధికారి ఎం. శివగురు ప్రభాకరన్. నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్నతనంలోనే కూలీగా పనిచేసిన ఆయన.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదువును కొనసాగించారు. చివరకు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో విజయం సాధించి ఐఏఎస్ అధికారిగా ఎదిగారు. ప్రస్తుతం పేదల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతూ తన జీవిత అనుభవాలను సమాజానికి ఉపయోగపడేలా చేస్తున్నారు..

తమిళనాడులోని తంజావూరు జిల్లా మెలట్టంకాడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్‌ది నిరుపేద కుటుంబం. తల్లి, తండ్రి, అక్క, తమ్ముడితో కలిసి ఆయన పెరిగారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండేవి. తండ్రి మద్యానికి బానిస కావడంతో కుటుంబంపై ఆర్థిక భారం మరింత పెరిగింది. అప్పులు కూడా ఎక్కువయ్యాయి. కుటుంబాన్ని పోషించేందుకు చిన్న వయసులోనే శివగురు కష్టపడాల్సి వచ్చింది. మూటలు మోశారు, కట్టెలు కొట్టారు, వ్యవసాయ కూలీగా పనిచేశారు. కొంతకాలం కట్టె కోత యంత్రం ఆపరేటర్‌గా కూడా పనిచేశారు. వచ్చిన డబ్బులో కొంత తన చదువుకు కేటాయించుకుని, మిగిలిన మొత్తాన్ని తల్లికి ఇచ్చేవారు. కుటుంబ సభ్యులందరూ కష్టపడితేనే పూట గడిచే పరిస్థితి ఉన్నప్పటికీ.. చదువుకోవాలన్న ఆయన ఆశ మాత్రం చావలేదు.
చదువే జీవితాన్ని మార్చింది..
ఆర్థిక ఇబ్బందుల మధ్యే శివగురు తన చదువును కొనసాగించారు. కుటుంబ బాధ్యతల్లో భాగంగా తమ్ముడి చదువుకు సహాయం చేయడంతో పాటు అక్క వివాహానికి కూడా తోడ్పడ్డారు. పరిస్థితులు కొంత మెరుగుపడిన తర్వాత తన చదువుపై మరింత దృష్టి పెట్టారు. వెల్లూరులోని ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థలో సివిల్ ఇంజనీరింగ్ చదివే అవకాశం లభించింది. అయితే ఆయనకు ఇంగ్లిష్ భాషపై పెద్దగా పట్టు లేదు. ఐఐటీలో చదవాలన్న లక్ష్యంతో చెన్నై వెళ్లి.. నిరుపేద విద్యార్థులకు శిక్షణ అందించే సంస్థ సహాయంతో ఇంగ్లిష్ నేర్చుకున్నారు.
రైల్వే స్టేషన్‌లో నిద్ర.. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ విజయం
చెన్నైలో కొత్త ప్రదేశం.. పరిచయస్తులు ఎవరూ లేరు.. చేతిలో డబ్బు లేదు. దీంతో కొంతకాలం సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌లో రాత్రిళ్లు నిద్రించేవారని ఆయన జీవిత కథలో పేర్కొంటారు. పగటిపూట మొబైల్ షాపులో పనిచేసి ఖర్చుల కోసం డబ్బు సంపాదించేవారు. రైల్వే స్టేషన్ బెంచీలపైనే కూర్చుని చదువుకునేవారు. అలా కష్టపడుతూ ఐఐటీ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యారు. చివరకు ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ చదివే అవకాశం దక్కించుకున్నారు. తన కల నెరవేరడంతో పాటు.. అక్కడ చదువుకుంటూనే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యారు. సివిల్స్ పరీక్షలో విజయం సాధించేందుకు శివగురు పట్టుదలతో ప్రయత్నించారు. నాలుగు ప్రయత్నాల అనంతరం మంచి ర్యాంకుతో యూపీఎస్సీ సివిల్స్‌లో విజయం సాధించి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించేందుకు రోజువారీ కూలీగా పనిచేసిన వ్యక్తి.. చివరకు దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసులో స్థానం సంపాదించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి.
తాను ఎదుర్కొన్న కష్టాలను ఇతరులు ఎదుర్కోకూడదనే ఆలోచనతో శివగురు పేదల కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన జీవిత కథలో పేర్కొంటారు. ఆయనకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఎంతో అభిమానం. కలాం కూడా సాధారణ కుటుంబం నుంచి ఎదిగి దేశానికి గొప్ప సేవ చేశారని భావించే శివగురు.. ఆయన స్ఫూర్తితో డాక్టర్ ఏపీజే విలేజ్ డెవలప్‌మెంట్ యూనిట్ అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు చెబుతారు. ఈ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సహాయం, విద్యకు ప్రోత్సాహం, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం.
శివగురు ప్రభాకరన్ వివాహం డాక్టర్ కృష్ణభారతితో జరిగింది. వివాహ సమయంలో కట్నంగా వచ్చే మొత్తాన్ని పేదల వైద్యానికి ఉపయోగించాలని కోరినట్లు ఆయన గురించి ప్రచారంలో ఉన్న కథనాలు చెబుతున్నాయి. అనంతరం భార్యతో కలిసి తన సొంత గ్రామమైన మెలట్టంకాడులో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంటారు. అంతేకాకుండా మద్యానికి బానిసైన వారికి ఆ అలవాటు నుంచి బయటపడేందుకు సహాయం చేయడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేని విద్యార్థులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. పేదరికం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని భావించే శివగురు ప్రభాకరన్ జీవితం.. కష్టాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.




