Agniveer Recruitment: ‘అగ్నివీర్’ల ఎంపికకు తెలంగాణలో 4 కేంద్రాలు ఏర్పాటు.. పాలిటెక్నిక్‌కి బోనస్ మార్కులు..
అగ్నివీర్‌ల నియామక పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత పరీక్ష కోసం తెలంగాణాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆర్మీ నియామక అధికారి కీట్స్ కె.దాస్ తెలిపారు..
అగ్నివీర్‌ల నియామక పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత పరీక్ష కోసం తెలంగాణాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆర్మీ నియామక అధికారి కీట్స్ కె.దాస్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో పరీక్షా కేంద్రాలుంటాయి. అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాతనే ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత అభ్యర్థులు హాల్ టికెట్లు అందుకుంటారు. కాగా త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకమే స్కీమ్ ‘అగ్నిపథ్’. దీని కింద నిర్వహించే నియామక పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఏప్రిల్ 17 నుంచి అగ్నివీర్ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది.
పాలిటెక్నిక్‌కి బోనస్ మార్కులు
ఐటీఐ లేదా పాలిటెక్నిక్ విద్యార్ధులకైతే 20 నుంచి 50 మార్కుల వరకు బోనస్‌గా వస్తాయి. అభ్యర్థుల ఎంపిక 3 దశల్లో ఉంటుంది. మొదట ప్రాథమిక పరీక్ష ఆన్‌లైన్‌లో, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో అర్హులకు, ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహిస్తారు. శారీరక దారుఢ్యం, దేహ దారుఢ్య పరీక్షలో అర్హులకు మెడికల్ టెస్టులు ఉంటాయి. మెడికల్ టెస్ట్లోనూ అర్హత సాధించిన వారు అగ్నివీరులుగా ఎంపికవుతారు. అభ్యర్థులకు సందేహాలుంటే 79961 57222 నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.