సర్కార్ బడులకు మూల్యాంకన పుస్తకాలు.. ఇకపై పరీక్షలన్నీ అందులోనే!
పాఠశాల విద్యలో నూతన విధానాలు తీసుకొస్తూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మూల్యాంకన పుస్తకాలను తీసుకువస్తున్నారు. 1, 2, 3, 4 తరగతులకు గతంలె ఫార్మె టివ్ ఎసెస్‌మెంట్ 1, 2 పరీక్షలను విద్యార్థులకు కాగితాలపై నిర్వహించేవారు. అయితే ఇకప ఈ ఆ విధానానికి..

అమరావతి, ఆగస్ట్ 12: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పాఠశాల విద్యలో నూతన విధానాలు తీసుకొస్తూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మూల్యాంకన పుస్తకాలను తీసుకువస్తున్నారు. 1, 2, 3, 4 తరగతులకు గతంలె ఫార్మె టివ్ ఎసెస్‌మెంట్ 1, 2 పరీక్షలను విద్యార్థులకు కాగితాలపై నిర్వహించేవారు. అయితే ఇకప ఈ ఆ విధానానికి స్వస్తి పలకనున్నారు. మూల్యాంకనం పుస్తకంలో అన్ని పరీక్షలు రాసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఎస్ఏ 1 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాకు 5,47,756, కృష్ణా జిల్లాకు 4,92,315 పుస్తకాలు ప్రభుత్వం సరఫరా చేస్తుంది.
తరగతుల వారీగా సరఫరా..
ఎన్టీఆర్ జిల్లాలోని 987 ప్రభుత్వ బడుల్లో 90,509 మంది, కృష్ణా జిల్లాలోని 1336 ప్రభుత్వ పాఠశాలల్లో 1,54,074 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సబ్జెకుల వారీగా మూల్యాంకన పుస్తకాలను అన్ని పాఠశాలలకు సరఫరా చేశారు. 1, 2 తరగతుల విద్యార్థులకు మూడు, 3. 4, 5 తరగతుల వారికి నాలుగేసి, 6, 7 తరగతులకు ఆరు, 8, 9, 10 తరగతుల వారికి ఏడు చొప్పున మూల్యాంకన పుస్తకాలను విద్యార్ధులకు అందజేస్తారు. వీటిల్లో విద్యార్ధులకు సంబంధించిన వివిధ వివరాలను ఉపాద్యాయులు ఎంటర్ చేయవల్సి ఉంటుంది. అంటే పరిశీలన, ఆపార్ ఐడీ, పరీక్షల నిర్వహణ, ప్రాజెక్టుల వివరాలు ఉంటాయి. మార్కులు, గ్రేడింగ్, ఓఎంఆర్ షీటు వివరాలను పొందుపరుస్తారు. ఫలితంగా విద్యార్థి వివరాలు, వారు తయారు చేసిన ప్రాజెక్టుల గురించి సులువుగా తెలుసుకో వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వారి ఆలోచన, నైపుణ్యాలను అంచనా వేయడానికి కూడా ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుంది.
విద్యార్ధులకు మూల్యాంకన పుస్తకాలు పంపిణీ చేసిన తర్వాత.. ప్రతి పరీక్ష అందులోనే రాయాల్సి ఉంటుంది. పరీక్షలన్నీ పూర్తయ్యాక మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు ఉపాధ్యాయుల సంతకంతో ఓ ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. తక్కువ ఉత్తీర్ణత నమోదైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. పరీక్షల అనంతరం ఈ పుస్తకాలను ఏడాది పొడవునా ఉపాధ్యాయులే బడుల్లో భద్రపరచాల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




