AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలో తప్పిదాలు.. సమాధానాల స్థానంలో ‘చుక్కలు’ దర్శనం! అభ్యర్ధుల గగ్గోలు

ఇటీవల విడుదలైన మెగా డీఎస్సీ ఆన్ లైన్ పరీక్ష రెస్సాన్స్ షీట్లు చూసి అభ్యర్ధులు గుడ్లు తేలేస్తున్నారు. తాము రాసిన ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని.. కొందరికి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయనట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమాధానాలు గుర్తించినా తప్పుగా చూపుతోందని, అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించినా కొన్నింటినే ఆన్సర్‌ చేసినట్టు నమోదైందని ఆధారాలతో సహా చూపుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులంతా సోమవారం రాత్రి డైరెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు..

Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలో తప్పిదాలు.. సమాధానాల స్థానంలో 'చుక్కలు' దర్శనం! అభ్యర్ధుల గగ్గోలు
Mega DSC Controversy
Srilakshmi C
|

Updated on: Jul 09, 2025 | 10:50 AM

Share

అమరావతి, జులై 9: మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు గందరగోళంగా మారాయి. ఆన్‌లైన్‌ పరీక్షలో తప్పిదాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు లబోదిబోమంటూ సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పోటెత్తారు. తాను అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు పెట్టినా కేవలం 10 ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్లు రెస్పాన్స్‌ షీట్‌లో వచ్చిందని ఓ అభ్యర్థి గగ్గోలు పెట్టాడు. ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని.. కొందరికి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయనట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమాధానాలు గుర్తించినా తప్పుగా చూపుతోందని, అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించినా కొన్నింటినే ఆన్సర్‌ చేసినట్టు నమోదైందని ఆధారాలతో సహా చూపుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులంతా సోమవారం రాత్రి డైరెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

కాగా టెట్ పరీక్షలు మాదిరి డీఎస్సీ పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. పీఈటీ, పీడీ పరీక్షలకు 100 మార్కులకు 200 ప్రశ్నలకు 3 గంటల సమయంలో, ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలు 80 మార్కులకుగాను 160 ప్రశ్నలకు 2.30 గంటల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కంప్యూటర్‌లో కనిపించే మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. జవాబు గుర్తించి సేవ్‌ చేస్తేనే ఆ ప్రశ్న నమోదవుతుంది. టెట్ పరీక్ష కూడా ఇదే తరహాలో ఉండటంతో అభ్యర్ధులు ఎలాంటి సందేహం లేకుండానే పరీక్షలు రాశారు. కానీ తాజాగా విడుదలైన డీఎస్సీ పరీక్షల రెస్పాన్స్‌ షీట్లు చూసి షాక్‌ తింటున్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినప్పటికీ 20 నుంచి 60 ప్రశ్నలకు అసలు సమాధానాలే గుర్తించనట్టు రావడంతో కంగుతిన్నారు. ఓ అభ్యర్థి 160 ప్రశ్నలకు150కి జవాబులు గుర్తిస్తే.. అందులో కేవలం 10 ప్రశ్నలకే జవాబులు గుర్తించినట్టు రెస్పాన్స్‌షీట్‌ వచ్చింది. మిగిలిన 140 ప్రశ్నల జవాబులకు చుక్కలు నమోదవడంతో ఖంగుతిన్నాడు. ఇదే సమస్య వందలాది డీఎస్సీ అభ్యర్థులకు ఎదురైంది. ఒకరిద్దరు కాదు ఏకంగా వందలాది అభ్యర్థులు గుర్తించిన జవాబులు కనిపించకుండా మాయం అవడమెంటో తెలియక తికమకపడుతున్నారు.

దీనిపై స్పందించిన అధికారులు ఆన్‌లైన్‌ బ్యాకప్‌ ఆడిట్‌ రిపోర్టు తిరగేసి సదరు అభ్యర్ధి కేవలం 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాశాడని, అభ్యర్థి సమాధానాలు గుర్తించకుండా ప్రశ్నపత్రాన్ని స్క్రోల్‌ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు చెప్పడం వింతల్లోనే వింతగా మారింది. అసలెక్కడా జవాబులకు టిక్‌ మార్కు పెట్టలేదని చెప్పడం గనమార్హం. అందుకే ఆయనకు రెస్పాన్స్‌ షీట్‌లో 10 ప్రశ్నలకే జవాబులు వచ్చాయని వెల్లడించాడు. మరోవైపు మెగా డీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో వచ్చేవన్నీ వదంతులని, వాటిని నమ్మొద్దని కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి ప్రకటించడం అయోమయానికి దారి తీస్తోంది. ఏళ్లకు ఏళ్లు కష్టపడిన తమ గతేంకావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.