AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter State 1st Ranker 2025: ఇంటర్ ఫలితాల్లో స్టేట్‌ టాప్ ర్యాంకర్లు వీరే.. అత్యధిక స్కోర్ ఎలా సాధించగలిగారంటే?

ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు శనివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో దాదాపు అన్ని గ్రూపుల్లోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలిచారు. ఫస్ట్, సెకండియర్‌కు కలిపి ఇంటర్‌ ఫలితాల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన అమ్మాయి స్టేట్ టాప్ ర్యాంకు సాధించి అబ్బురపరిచింది..

AP Inter State 1st Ranker 2025: ఇంటర్ ఫలితాల్లో స్టేట్‌ టాప్ ర్యాంకర్లు వీరే.. అత్యధిక స్కోర్ ఎలా సాధించగలిగారంటే?
AP Inter State Rankers 2025
Srilakshmi C
|

Updated on: Apr 13, 2025 | 2:36 PM

Share

అమరావతి, ఏప్రిల్ 13: ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఇంటర్‌ విద్యార్ధులకు శనివారం (ఏప్రిల్ 12 ) ఇంటర్‌ బోర్డు ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో దాదాపు అన్ని గ్రూపుల్లోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలిచారు. ఫస్ట్, సెకండియర్‌కు కలిపి తాజా ఇంటర్‌ ఫలితాల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన షబానాజ్‌ అనే విద్యార్ధి బైపీసీ గ్రూపులో ఏకంగా 993 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచింది. షబానాజ్‌ తండ్రి ఇమ్రాన్‌బాషా ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా, తల్లి షాహినాజ్‌ బేగం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. షబానాజ్‌కు ఇంటర్‌ ఫస్టియర్‌లో 436 మార్కులు వచ్చాయి. ఇంటర్‌ పరీక్షలకు రోజకు 10 గంటల పాటు ప్రిపరేషన్‌ సాగించానని, దానికి తగ్గ ఫలితం దక్కిందని షబానాజ్‌ ఆనందం వ్యక్తం చేసింది. డాక్టర్ చదివి పేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెబుతుంది ఈ ఆణిముత్యం.

స్టేట్ సెకండ్‌ ర్యాంకులో మెరిసిన ఇద్దరమ్మాయిలు..

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని ఇందిరానాయక్‌నగర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ రహమాన్, గౌసియాల కుమార్తె అఫిఫా తబస్సుమ్‌ బైపీసీలో 992 మార్కులు సాధించింది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి.. ఏ రోజు పాఠాలు ఆరోజే చదివే తబస్సుమ్‌.. డాక్టర్‌ కావాలన్న లక్ష్యంతో నీట్‌కు సిద్ధమవుతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జానకయ్యపేటకు చెందిన కురమదాసు శ్రీజ.. ఎంపీసీలో 992 మార్కులతో మెరిసింది. శ్రీజ పదో తరగతిలోనూ 590 మార్కులు సాధించింది. ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది.

ఇంటర్‌ స్టేట్ థార్డ్ ర్యాంకుకొట్టిన పేపర్‌ బాయ్‌

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రానికి చెందిన ఇరోతు సాయిగణేశ్‌.. ఎంపీసీ గ్రూపులో 981 మార్కులతో సత్తా చాటాడు. గణేశ్‌ తండ్రి చనిపోగా, తల్లి దినసరి కూలిగా పని చేస్తూ కుమారుడిని చదివిస్తుంది. గణేశ్‌ పేపర్‌బాయ్‌గా పనిచేస్తూ.. తల్లికి చేదోడువాదోడుగా ఉంటూనే కష్టపడి చదువుకునేవాడు. ఫస్టియర్‌లో 463 మార్కులు సాధించాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తనకు స్ఫూర్తి అని గణేశ్‌ చెబుతున్నాడు. చిన్నతనంలోనే కష్టాలు వెక్కిరించినా ఏ మాత్రం తొనగక బెదరక చదువులో మెరిసిన గణేశ్‌ ఎందరో నిరుపేద విద్యార్ధులకు స్ఫూర్తి. ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని తమ్మినేని చాతుర్య ఇంటర్‌ ఆర్ట్స్‌ (హెచ్‌ఈసీ) గ్రూపులో 980 మార్కులు సాధించి స్టేట్‌ థార్డ్‌ ర్యాంకు సాధించింది. చాతుర్య ఇంటర్ ఫస్టియర్‌లో 490 మార్కులు సాధించింది. గ్రూప్స్, సివిల్స్‌ లక్ష్యంగా ఆర్ట్స్‌ గ్రూప్‌ ఎంచుకున్నట్లు చాతుర్య చెబుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణానికి చెందిన సకలాభక్తుల వంశీ అనే మరో విద్యార్ధి ఎంపీసీ ఫస్టియర్‌లో 470 మార్కులకు గానూ అత్యధికంగా 454 మార్కులు సాధించాడు. అయితే వంశీ అందరిలా నడవలేడు. పుట్టిన వెంటనే మెదడు సంబంధిత వ్యాధికి గురైన వంశీని అంగవైకల్యం కుంగదీయలేదు. చదువును ఆయుధంగా మలచుకుని దూసుకుపోతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.