Internal Marks System: ఇంటర్మీడియట్‌లో 20% ఇంటర్నల్‌ మార్కులు.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు!

తెలుగు రాష్ట్రాలోని ఇంటర్మీడియట్ విద్యలో వచ్చే విద్యా సంవత్సరంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఇంటర్ కోర్సుల్లో ఇంటర్నల్ మార్కుల విధానంలో రెండు రాష్ట్రాలు విభిన్న నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఇంటర్ లో అమలు చేస్తున్న ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తుంటే.. అటు ఏపీ మాత్రం అమలు చేయనున్నట్లు ప్రకటించింది..

Internal Marks System: ఇంటర్మీడియట్‌లో 20% ఇంటర్నల్‌ మార్కులు.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు!
Internal Marks System in AP Inter
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 13, 2025 | 1:32 PM

అమరావతి, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యావిధానంలో సంస్కరణల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు నూతన విధానాలను ఇంటర్‌ బోర్డు ప్రతిపాదించింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు రద్దు చేయడంతోపాటు సిలబస్‌లోనూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుంది. దీనిలో భాగంగా ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థలో ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని తీసుకువచ్చేందుకు ఇంటర్మీడియట్‌బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. అంటే ఇంటర్‌ ఆర్ట్స్‌ గ్రూపులకు 20 శాతం ఇంటర్నల్‌ మార్కులు, సైన్సు గ్రూపు విద్యార్థులకు 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ ఉండనున్నాయి. దీంతో ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు ప్రతి సబ్జెక్టుకి ఆర్ట్స్‌ గ్రూపుకైతే 80 మార్కులకు, సైన్స్‌ గ్రూప్‌లకయితే 70 మార్కులకు మాత్రమే పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ సిలబస్‌తో పాటు పరీక్షల విధానాన్ని కూడా పూర్తిగా సీబీఎస్‌ఈ నమూనాలోకి మార్చాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకువచ్చే అవకాశముంది.

నూతన సంస్కరణలు అమలులోకి వస్తే ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలకు బదులు అంతర్గత పరీక్షలు మాత్రమే జరుగుతాయి. అలాగే ఇంటర్‌ రెండో ఏడాదిలో నిర్వహించే పబ్లిక్‌ పరీక్షల్లో కేవలం సెకండియర్‌ సిలబస్‌ మాత్రమే కాకుండా ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి.. తదనుగుణంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

మరికొన్ని మార్పులు ఇలా..

మ్యాథమెటిక్స్‌లో ప్రస్తుతం 2 పేపర్లుగా ఉండగా.. ఈ రెండింటినీ 100 మార్కులకు కుదించి ఒక్క పేపర్‌కే పరీక్ష నిర్వహిస్తారు. అలాగే వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రంలను కూడా కలిపి వంద మార్కులకు ఒకే పేపర్‌ కింద మార్చి జీవశాస్త్రంగా పిలుస్తారు. ఇక ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 30 మార్కులకు ప్రస్తుతం ఉన్నట్లే ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఆర్ట్స్‌ సబ్జెక్టులకు ఇచ్చినట్లే గణితానికి సంబంధించి 20 శాతం ఇంటర్నల్‌ మార్కుల విధానం ఉంటుంది. ప్రస్తుతం ఫస్ట్‌, సెకండ్‌ ల్వాంగ్వేజెస్‌లతోపాటు ఇంటర్‌ ఫస్ట్‌, సెకండియర్‌లకు కలిపి మొత్తం 1000 మార్కులకు పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్నాయి. కొత్త విధానంలో 500 మార్కులకే పరీక్షలు జరుగుతాయి. మొదటి ఏడాది అన్నీ అంతర్గత పరీక్షలే కావడంతో రెండో ఏడాది వచ్చే మార్కులనే ప్రామాణికంగా ఉండనున్నాయి. ఒక ల్వాంగ్వేజ్‌ సబ్జెక్టుగా ఆంగ్ల భాష తప్పనిసరిగా ఉంటుంది. ఇక రెండో ల్వాంగ్వేజ్‌ సబ్జెక్టు ఐచ్ఛికంగా విద్యార్థులు ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చు. అంటే ఆర్ట్స్‌ గ్రూప్‌ వారికి ఆసక్తి ఉంటే జీవశాస్త్రం, గణితంలాంటి వాటిని కూడా రెండో సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే ఛాన్స్‌ ఉంటుందన్నమాట.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఏపీ రాష్ట్రంలోని ఇంటర్‌ విద్యలో ఇంటర్నల్‌ మార్కులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తీసుకొస్తుంటే.. అటు తెలంగాణలో మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని రద్దు చేస్తుంది. ఇందుకు కారణం కొన్ని ప్రైవేట్‌ కాలేజీలకు ఇంటర్నల్‌ మార్కుల్లో తమ విద్యార్ధులకు పూర్తి మార్కులు కేటాయిస్తూ అవకతవకలకు పాల్పడమే. ఇక సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.