10th Class Public Exams 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్..! ఇంతకీ ఎప్పుడంటే?
Andhra Pradesh 10th Class Public examinations 2026 Dates: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే తేదీల ఖరారుపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. దీంతో విద్యాశాఖ అధికారులు మార్చి 16తో ఒక టైంటేబుల్, మార్చి 21తో మరో టైంటేబుల్

అమరావతి, నవంబర్ 18: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే తేదీల ఖరారుపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. దీంతో విద్యాశాఖ అధికారులు మార్చి 16తో ఒక టైంటేబుల్, మార్చి 21తో మరో టైంటేబుల్ రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ రెండింటిలో ప్రభుత్వం దేనికి అనుమతి ఇస్తే.. ఆ ప్రకారంగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈలోగా పరీక్షల సిబ్బంది నియామకం, ఇన్విజిలేటర్ల ఎంపిక, పరీక్ష సెంటర్ల గుర్తింపుపై అధికారులు దృష్టి సారించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.50 లక్షలమంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 3,500 సెంటర్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షల నిర్వహణకు 35 వేలమంది ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించే పనిలో విద్యాశాఖ పడింది. వీరితోపాటు మరో రెండువేల మంది స్క్వాడ్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. గతేడాది ఇన్విజిలేటర్ల ఎంపికను జిల్లాల్లో చేపట్టగా, ఈసారి రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్ నుంచే చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఇన్విజిలేటర్ల ఎంపిక కోసం రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలను ఇన్విజిలేటర్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇందుకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయుల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని డైరెక్టరేట్ అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. అయితే వీరిలో గతంలో చార్జి మెమోలు తీసుకున్నవారు, సస్పెన్షన్‌కు గురైనవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారిని పరీక్ష విధులకు దూరం పెట్టాలని విద్యాశాఖ భావిస్తుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ల విషయంలోనూ ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. పరీక్షల సమయంలో సంబంధిత సబ్జెక్టు టీచర్లు పరీక్ష విధులకు హాజరుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా గతేడాది పదో తరగతి పరీక్ష పేపర్లు వాట్సాప్‌లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది అలాంటి పొరబాట్లు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిసెంబర్ మొదటి వారంలోగా పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








