AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. కట్‌చేస్తే జాంబియా సుప్రీంకోర్టు తొలి చీఫ్‌ జస్టిస్‌గా ఎంపిక! ఆమె కథ ఇదే

భారత సంతతికి చెందిన అభా నాయర్‌ పటేల్‌ అరుదైన ఘనత సాధించారు. జాంబియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా అభా చరిత్ర సృష్టించారు. ఢిల్లీలో జన్మించిన ఆమె.. ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి జాంబియాకు వలస వెళ్లారు..

7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. కట్‌చేస్తే జాంబియా సుప్రీంకోర్టు తొలి చీఫ్‌ జస్టిస్‌గా ఎంపిక! ఆమె కథ ఇదే
Abha Nair Patel Makes History
Srilakshmi C
|

Updated on: Aug 22, 2026 | 7:57 AM

Share

1973లో జీవనోపాధి కోసం అభా కుటుంబం జాంబియాకు వెళ్లింది. అక్కడే ఆమె విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. యూనివర్సిటీ ఆఫ్‌ జాంబియాలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన అభా.. అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ నుంచి ఎల్‌ఎల్‌ఎమ్‌ పట్టా పొందారు. 1989లో జాంబియా బార్‌లో చేరి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ప్రారంభంలో దిగువ కోర్టుల్లో ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేసిన ఆమె.. అంచెలంచెలుగా న్యాయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1998లో జాంబియాలో ‘పటేల్‌ అండ్‌ అసోసియేట్స్‌’ అనే న్యాయ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడవడం విశేషం. జాంబియాలో మహిళా నాయకత్వంలో ఏర్పాటైన తొలి న్యాయ సంస్థగా ఇది గుర్తింపు పొందింది. రెండు దశాబ్దాలకు పైగా సంస్థను విజయవంతంగా నడిపిన అభా.. తన న్యాయ పరిజ్ఞానం, నాయకత్వ సామర్థ్యంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. 2016లో ఆమెకు జాంబియా ‘స్టేట్‌ కౌన్సెల్‌’ హోదా లభించింది. అప్పటికి ఈ గౌరవాన్ని అందుకున్న మూడో మహిళా న్యాయవాదిగా ఆమె నిలిచారు.

భారత సుప్రీంకోర్టులోనూ అరుదైన ఘనత

ఇటీవల ‘సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌’ (SCAORA) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు అభా భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ ఆహ్వానం మేరకు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీఠంపై ఆసీనులయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి జాంబియా న్యాయమూర్తిగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా భారత్‌తో తన అనుబంధాన్ని అభా గుర్తుచేసుకున్నారు. తాము జాంబియాలో స్థిరపడినప్పటికీ తమ మనసుల్లో భారత్‌ ఎప్పటికీ ఉంటుందని అన్నారు. భారత రాజ్యాంగ చట్టాన్ని అధ్యయనం చేయకుండా న్యాయశాస్త్ర విద్య పూర్తికాదని పేర్కొన్నారు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా తమ సంప్రదాయాలు, భాష, సంస్కృతిని మర్చిపోరని అభా పేర్కొన్నారు. తాము గుజరాతీ కుటుంబానికి చెందినవారమని, తనకు గుజరాతీ భాష స్పష్టంగా వచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కిలిమంజారో అధిరోహించిన సాహసికురాలు

అభా నాయర్‌ పటేల్‌ న్యాయరంగంలోనే కాకుండా సాహస కార్యక్రమాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2018లో ఓ స్వచ్ఛంద సంస్థ కోసం నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఢిల్లీలో జన్మించి జాంబియాలో పెరిగి.. న్యాయవాదిగా, న్యాయ సంస్థ అధిపతిగా, ఇప్పుడు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన అభా నాయర్‌ పటేల్‌ ప్రస్థానం భారత సంతతికి చెందిన వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Follow Us