నగల కోసం నానమ్మను హత్య చేసిన మనుమడు.. ఈఎంఐల కోసం దారుణం!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలో నగల కోసం వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. యాదమ్మ (70)ను ఆమెకు బంధువైన రాజు నగలు ఇవ్వలేదనే ఆగ్రహంతో తాడుతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.36 లక్షల ఇంటి రుణం ఈఎంఐలు చెల్లించేందుకు యాదమ్మ వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను తాకట్టు పెట్టాలని రాజు కోరినట్లు వెల్లడించారు.

బంధాలు బుగ్గవుతున్నాయి.. మానవత్వం మంటగలుస్తోంది. ఆప్యాయంగా ఒడిలో దాచుకున్న చేతులే.. చివరకు ఆ గొంతును నులిమాయి. వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటాడనుకున్న వాడే.. కాసుల కక్కుర్తితో కాలయముడయ్యాడు. ఇంటి ఈఎంఐలు చెల్లించేందుకు తనకు జోలపాడిన నానమ్మనే హత్య చేసిన మనుమడి ఘాతుకం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది.
భర్తకు దూరంగా.. ఒంటరి జీవితం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటకు చెందిన యాదమ్మకు వివాహమైన ఆరు నెలలకే భర్తతో విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆమె తన పుట్టిన ఊరైన తూప్రాన్‌పేటలోనే ఒంటరిగా జీవిస్తోంది. వృద్ధాప్యంలో ఉన్న యాదమ్మను ఆమె మేనల్లుడి కుమారుడు రాజు తరచూ చూసుకునేవాడు. దీంతో యాదమ్మకు రాజుపై నమ్మకం పెరిగింది.
రూ.36 లక్షల రుణం.. ఈఎంఐల ఒత్తిడి
రాజు పాల వ్యాపారం చేసేవాడు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల తూప్రాన్‌పేట బ్యాంకు కాలనీలో రూ.36 లక్షల బ్యాంకు రుణంతో ఇల్లు కొనుగోలు చేశాడు. అయితే నెలనెలా ఈఎంఐలు చెల్లించడం అతడికి భారంగా మారింది. రుణ వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకు నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో యాదమ్మ వద్ద బంగారం, వెండి ఆభరణాలు ఉన్న విషయం రాజుకు తెలిసింది. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి ఈఎంఐలు చెల్లించేందుకు సహాయం చేయాలని యాదమ్మను కోరాడు. అయితే ఆ నగలు కుటుంబ సభ్యులందరికీ చెందుతాయని, తాను వాటిని ఇవ్వలేనని యాదమ్మ స్పష్టం చేసింది.
నగలు ఇవ్వలేదని.. గొంతు నులిమి హత్య
యాదమ్మ తనకు సహకరించకపోవడంతో రాజు ఆగ్రహానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. నగల కోసం ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తాడుతో యాదమ్మ గొంతు నులిమి హత్య చేసి.. ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. యాదమ్మ (70) గత నెల 27న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోని బంగారు నగలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. మేనల్లుడు దర్శన్ ఇచ్చిన ఫిర్యాదుతో చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదికలో యాదమ్మది సహజ మరణం కాదని.. హత్యగా తేలడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్ట్
హత్య అనంతరం రాజు వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. సాధారణంగా యాదమ్మతో తరచూ మాట్లాడే రాజు.. ఘటన తర్వాత ఆమెకు దూరంగా ఉండటం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో అతడి కాల్‌డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. దీంతో రాజుపై అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజును అదుపులోకి తీసుకుని విచారించగా.. నగల కోసమే యాదమ్మను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 5.6 తులాల బంగారం, వెండి ఆభరణాలు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. నమ్మిన మనిషే.. తన జీవితానికి చివరి రోజుల్లో అండగా నిలవాల్సిన వాడే.. నగల కోసం ప్రాణం తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
