మక్కాలో ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష.. వారి మధ్య సంబంధంపై సందేహాలు!
సౌదీ అరేబియాలో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష అమలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మక్కా ప్రాంతంలో ఒక మసీదులో జరిగినట్లు పేర్కొన్న ఘటనకు సంబంధించిన కేసులో మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది. నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ అనే ఇద్దరికి అమలు చేసినట్లు సమాచారం.

సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతంలో ఒక మసీదులో జరిగినట్లు పేర్కొన్న ఘటనకు సంబంధించిన కేసులో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష అమలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ అనే ఇద్దరికి అక్టోబర్ 14న శిక్ష అమలు చేసినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏమిటి? వారు సౌదీ అరేబియాకు ఎందుకు వెళ్లారు? అసలు కేసులో ఏం జరిగింది? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సౌదీ అధికారులను వివరాలు కోరింది.
ఇద్దరూ భార్యాభర్తలేనా?
నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ భార్యాభర్తలంటూ కొన్ని వార్తలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే నజ్రుల్ తండ్రి అబ్దుల్ బషీర్ ఈ విషయాన్ని ఖండించినట్లు బంగ్లాదేశ్‌కు చెందిన మీడియా సంస్థలు వెల్లడించాయి. స్వీటీ అక్తర్ తన కుమారుడి భార్య కాదని, ఆమె గురించి తమ కుటుంబానికి తెలియదని నజ్రుల్ తండ్రి చెప్పారు. ఇద్దరూ ఒకే చోట పనిచేసేవారని మాత్రమే తమకు తెలుసని తెలిపారు. దీంతో వారిద్దరూ భార్యాభర్తలనే ప్రచారంపై సందేహాలు నెలకొన్నాయి. వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఉద్యోగం కోసం సౌదీకి వెళ్లిన నజ్రుల్
నజ్రుల్ ఇస్లాం ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లినట్లు ఎలాంటి అధికారిక ఆధారాలు లభించలేదని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. నజ్రుల్ 2022 నవంబర్ 10న ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవాడు. కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే విదేశాలకు వెళ్లినట్లు అతని తండ్రి తెలిపారు. సౌదీ అరేబియాకు వెళ్లిన సుమారు ఆరు నెలల తర్వాత నజ్రుల్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు పేర్కొంది. అయితే స్వీటీ అక్తర్ ఎప్పుడు సౌదీకి వెళ్లింది? అక్కడ ఏ పని చేసేది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మసీదులో ఏం జరిగింది?
మక్కాలోని ఒక మసీదులో అసభ్యకర చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలపై నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నజ్రుల్ సుమారు మూడేళ్ల మూడు నెలల పాటు నిర్బంధంలో ఉన్నట్లు అతని కుటుంబం వెల్లడించింది. సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఇద్దరిని అరెస్టు చేసి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఆరోపణలు నిరూపితమైనట్లు పేర్కొంటూ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 14న మక్కా ప్రాంతంలో శిక్ష అమలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఘటన జరిగిన మసీదు పేరు, అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు, కేసులో సమర్పించిన ఆధారాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. నిందితులకు న్యాయవాదుల సహాయం అందిందా? అప్పీల్ చేసేందుకు అవకాశం లభించిందా? అనే విషయాలపై కూడా స్పష్టమైన సమాచారం లేదు.
మరణశిక్ష విషయం మీడియా ద్వారానే తెలిసిందా?
నజ్రుల్ తల్లి రహీమా బేగం తన కుమారుడు ప్రతి ఆదివారం జైలు నుంచి ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడని తెలిపారు. అయితే మరణశిక్ష అమలుకు ముందు తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. మీడియా వార్తల ద్వారానే కుమారుడి మరణవార్త తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి విషయంలో అన్యాయం జరిగి ఉంటే న్యాయం చేయాలని నజ్రుల్ తండ్రి అబ్దుల్ బషీర్ ప్రభుత్వాన్ని కోరారు. కుమారుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నజ్రుల్‌ను సౌదీ అరేబియాకు పంపేందుకు ఏడు లక్షల బంగ్లాదేశీ టాకాలు అప్పుగా తీసుకున్నట్లు తండ్రి తెలిపారు. కుమారుడి మరణం తర్వాత అప్పు ఇచ్చినవారు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. నజ్రుల్ మరణశిక్ష వార్త తెలిసిన తర్వాత అతని పిన్ని అబీదా బేగం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సౌదీ అధికారులను వివరణ కోరిన బంగ్లాదేశ్
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం సౌదీ అరేబియా నుంచి పూర్తి వివరాలు కోరింది. ఢాకా ట్రిబ్యూన్, ఇద్దరికి మరణశిక్ష అమలు చేయడానికి ముందు తమ ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందలేదని బంగ్లాదేశ్ వర్గాలు తెలిపాయి. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న జెడ్డాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ సౌదీ అధికారులను సంప్రదించింది. ఇద్దరి గుర్తింపు, వారి నేపథ్యం, కేసు వివరాలు, న్యాయస్థానం తీర్పు ప్రతిని అందించాలని కోరింది. సౌదీ ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం అందిన తర్వాతే ఈ కేసులో జరిగిన పరిణామాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
