హైదరాబాద్‌లో లేడీ డాన్ అరెస్ట్.. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరింపులు!
హైదరాబాద్‌లో రేష్మా డాన్ అలియాస్ రేష్మా బేగంను లంగర్ హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హషీంనగర్‌కు చెందిన ఓ కుటుంబాన్ని డబ్బుల కోసం వేధిస్తూ, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అత్తాపూర్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు, హుమాయూన్‌నగర్ పరిధిలో జరిగిన బైక్ దహనం కేసులోనూ ఆమె ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు..

హైదరాబాద్, నవంబర్ 22: నగరంలో మరోసారి లేడీ డాన్ వ్యవహారం కలకలం రేపింది. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకోవడం, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రేష్మా డాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో లంగర్ హౌస్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..
హషీంనగర్‌కు చెందిన అర్షియా ఖాన్ కుటుంబాన్ని రేష్మా డాన్ అలియాస్ రేష్మా బేగం గత వారం రోజులుగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుటుంబ సభ్యులందరినీ చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ తన సోదరుడి నుంచి పలుమార్లు డబ్బులు తీసుకుందని, ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధించడమే కాకుండా అతడిపై దాడికి కూడా పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అత్తాపూర్‌లోని ఎస్ఎన్ఆర్ గార్డెన్స్ సమీపంలో రేష్మా బేగంను లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు.
బైక్ దహనం కేసులోనూ ప్రమేయం?
రేష్మా అరెస్ట్‌తో మరో పాత కేసు అంశం కూడా వెలుగులోకి వచ్చింది. హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన బైక్ దహనం కేసులోనూ తన ప్రమేయం ఉన్నట్లు విచారణలో ఆమె అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. రేష్మా డాన్‌పై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఫొటోలు, పోస్టుల ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకుని, ఆ తర్వాత వారిని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూవివాదాలు, కబ్జాలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటూ ఇతరులను భయపెట్టేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. రేష్మా డాన్ అరెస్ట్‌తో ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? ఆమెతో కలిసి పనిచేసే బృందంలో ఇంకెంతమంది ఉన్నారు? బెదిరింపులు, డబ్బుల వసూళ్లు, ఇతర వివాదాల్లో మరికొందరి ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రేష్మా అరెస్ట్‌తో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసుల తదుపరి విచారణలో ఎలాంటి వివరాలు బయటపడతాయో వేచి చూడాలి.




