పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్ పరీక్షలు 2027 షురూ..?
పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెన్త్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 18 నుంచి నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. ప్రతిపాదనల ప్రకారం ఏప్రిల్ 10తో ప్రధాన పరీక్షలు ముగియనున్నాయి. మరోవైపు, పదో తరగతి ఒరిజినల్ మార్కుల మెమోలో పేరు, పుట్టిన తేదీ వంటి తప్పుల సవరణకు ఇకపై మీ సేవా ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ కొత్త విధానం తీసుకొచ్చింది..

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం లభించిన తర్వాత అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 10వ తేదీతో ముగియనున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 10 వరకు మొత్తం 24 రోజుల వ్యవధిలో పరీక్షల ప్రక్రియ కొనసాగనుంది. అయితే పరీక్షల తేదీలపై తుది స్పష్టత అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే రానుంది.
ఏడు పేపర్లకు పరీక్షలు
పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జెక్టులు ఉన్నప్పటికీ ఏడు పేపర్లకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సైన్స్ సబ్జెక్టులో భౌతికశాస్త్రం (ఫిజికల్ సైన్స్), జీవశాస్త్రం (బయోలాజికల్ సైన్స్) పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తారు. దీంతో విద్యార్థులు మొత్తం ఏడు పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు గతేడాది సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి ఇచ్చారు. అదే విధానాన్ని ఈసారి కూడా కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తెలంగాణలో ఈసారి సుమారు 5.25 లక్షల నుంచి 5.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ చేపడుతోంది. మరోవైపు ఆలస్య రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లించేందుకు నవంబర్ 26వ తేదీ వరకు గడువు ఇచ్చారు. విద్యార్థులు నిర్ణీత సమయంలో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి మరో కీలక మార్పును పాఠశాల విద్యాశాఖ తీసుకొచ్చింది. ఒరిజినల్ మార్కుల మెమోలో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఇకపై మీ సేవా పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఆఫ్‌లైన్ లేదా మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించకూడదని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానంపై డిప్యూటీ విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించాలని సూచించారు.
మీ సేవా ద్వారా మార్కుల మెమో సవరణ ఎలా?
- కొత్త విధానం ప్రకారం విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు మీ సేవా కేంద్రాన్ని సందర్శించి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలి.
- మొదట మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు వివరాలు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చేరుతాయి.
- హెచ్‌ఎం దరఖాస్తును పరిశీలించి ఆమోదించాలి.
- అనంతరం దరఖాస్తుదారులు అవసరమైన సర్టిఫికెట్లతో ఎస్‌ఎస్‌సీ బోర్డును సంప్రదించాలి.
- బోర్డు పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం సవరణలు చేపడతారు.
గతంలో మూడు సంవత్సరాల లోపు మార్కుల మెమో సవరణలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆమోదంతో ఎస్‌ఎస్‌సీ బోర్డును సంప్రదించే అవకాశం ఉండేది. అంతకుమించిన కాలం గడిచిన సందర్భాల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం అనుమతి అవసరమయ్యేది. తాజా విధానంలో మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి కావడంతో ప్రక్రియలో మరింత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌తో పాటు మార్కుల మెమో సవరణ విధానంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరీక్షల తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూడాల్సి ఉంది.




