AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బులు నష్టపోకండి..!ఇండేన్, హెచ్‌పి, భారత్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కీలక హెచ్చరిక!

వంటగ్యాస్ (LPG) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త కేవైసీ(KYC), సబ్సిడీ మోసాలకు పాల్పడుతున్నారని ప్రముఖ బ్యాంకులు హెచ్చరికలు జారీ చేశాయి. గ్యాస్ ఏజెన్సీలు లేదా ఆయిల్ కంపెనీల ప్రతినిధులమంటూ ఫోన్లు, వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా నకిలీ మెసేజ్‌లు పంపుతున్నారు. వెంటనే e-KYC అప్‌డేట్ చేయకపోతే గ్యాస్ కనెక్షన్ నిలిపివేస్తామని లేదా సబ్సిడీ ఆగిపోతుందని భయపెట్టి నకిలీ లింక్‌లు, APK ఫైళ్లను పంపిస్తున్నారు. కాబట్టి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వెబ్‌సైట్లు లేదా యాప్‌ల ద్వారా మాత్రమే గ్యాస్ సేవలను పొందాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

డబ్బులు నష్టపోకండి..!ఇండేన్, హెచ్‌పి, భారత్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కీలక హెచ్చరిక!
Lpg Ekyc Scam
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2026 | 7:26 AM

Share

వంటగ్యాస్ (LPG) సిలిండర్లు వినియోగించే కోట్లాది మంది కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. గ్యాస్ బుకింగ్, సబ్సిడీ, e-KYC అప్‌డేట్ పేరుతో జరుగుతున్న ఈ ఆన్‌లైన్ దోపిడీపై కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు వినియోగదారులను అప్రమత్తం చేశాయి. ఇండేన్, హెచ్‌పీ (HP), భారత్ గ్యాస్ కస్టమర్లే లక్ష్యంగా ఈ మోసాలు వేగంగా విస్తరిస్తున్నాయని బ్యాంకింగ్, సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు?

సైబర్ మోసగాళ్లు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు, ఆయిల్ కంపెనీల సిబ్బంది లేదా ప్రభుత్వ అధికారులమంటూ కస్టమర్లకు ఫోన్లు, వాట్సాప్, ఎస్ఎంఎస్‌లు పంపుతున్నారు. మీ LPG సబ్సిడీ నిలిచిపోయిందని, బిల్లు పెండింగ్‌లో ఉందని లేదా వెంటనే e-KYC పూర్తి చేయకపోతే ఈ రోజే గ్యాస్ కనెక్షన్ కట్ అవుతుందని భయాందోళనలు సృష్టిస్తున్నారు. అత్యవసర సేవ కావడంతో చాలామంది ఆందోళనకు గురై వారు పంపిన నకిలీ వెబ్‌సైట్ లింక్‌లపై క్లిక్ చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో గ్యాస్ సపోర్ట్ యాప్ పేరుతో హానికరమైన APK ఫైళ్లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయమని కోరుతున్నారు.

నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతా ఖాళీ!

బాధితులు ఆ నకిలీ లింక్‌లను ఓపెన్ చేసినా లేదా APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసినా, వారి మొబైల్ ఫోన్ నియంత్రణ పూర్తిగా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీని ద్వారా ఫోన్‌కు వచ్చే బ్యాంక్ ఓటీపీలు (OTP), ముఖ్యమైన మెసేజ్‌లను మోసగాళ్లు దొంగిలిస్తారు. అలాగే వెరిఫికేషన్ పేరుతో చిన్న మొత్తంలో పేమెంట్ చేయమని అడిగి, ఏటీఎం పిన్, సీవీవీ (CVV), యూపీఐ పిన్ (UPI PIN) వంటి రహస్య వివరాలను సేకరిస్తారు. ఆ వెంటనే నిమిషాల్లోనే బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి లక్షల రూపాయలను అక్రమంగా బదిలీ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ తరహా డిజిటల్ మోసాల నుంచి రక్షించుకోవడానికి గ్యాస్ వినియోగదారులు కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలని బ్యాంకులు, పోలీసులు సూచిస్తున్నారు.

గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్, ఎస్ఎంఎస్ లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.

ఎవరు అడిగినా ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ లేదా యూపీఐ పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దు.

ఫోన్‌లో అపరిచిత యాప్‌లు లేదా APK ఫైళ్లను అసలు డౌన్‌లోడ్ చేయవద్దు.

గ్యాస్ బుకింగ్, సబ్సిడీ లేదా e-KYC వివరాల కోసం కేవలం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్, యాప్ లేదా సమీపంలోని అధీకృత గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ను మాత్రమే సంప్రదించండి.

ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us