AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

101 గంటల నాన్‌స్టాప్ ప్రయాణం.. 5,700 కి.మీ. ఎగిరి సోమాలియా చేరిన అముర్ ఫాల్కన్ అలంగ్!

మణిపూర్ నుంచి బయలుదేరిన అలంగ్ అనే అముర్ ఫాల్కన్ పక్షి ప్రకృతిలో ఒక అద్భుత రికార్డు సృష్టించింది. ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి తీసుకోకుండా వరుసగా 101 గంటల పాటు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించి 5,700 కిలోమీటర్ల దూరంలోని సోమాలియాకు చేరుకుంది. దీని సహచర పక్షి అపాపాంగ్ కూడా 95 గంటల్లో 4,100 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించి ఆఫ్రికా దిశగా దూసుకెళ్తోంది. తమిళనాడు సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

101 గంటల నాన్‌స్టాప్ ప్రయాణం.. 5,700 కి.మీ. ఎగిరి సోమాలియా చేరిన అముర్ ఫాల్కన్ అలంగ్!
Alang The Amur Falcon Creat
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2026 | 7:04 AM

Share

5,700 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం, వరుసగా 101 గంటల పాటు ఎడతెరిపి లేని ప్రయాణం… మధ్యలో ఎక్కడా ఆగకుండా, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఒక చిన్న పక్షి ఇంతటి సాహసం చేయడం వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ, మణిపూర్ నుంచి బయలుదేరిన అలంగ్ అనే అముర్ ఫాల్కన్ డేగ జాతి పక్షి. దీనిని నిజం చేసి చూపించింది. వరుసగా నాలుగు రోజులకు పైగా అరేబియా సముద్రం మీదుగా ఆగకుండా ఎగురుతూ సోమాలియా తీరానికి చేరుకుని అరుదైన రికార్డును నెలకొల్పింది.

ఆఫ్రికా దిశగా దూసుకెళ్తున్న అపాపాంగ్

అలంగ్‌తో పాటు ప్రయాణం ప్రారంభించిన దాని సహచర పక్షి అపాపాంగ్ కూడా ఆకాశంలో తన సత్తా చాటుతోంది. తాజా సమాచారం ప్రకారం, అపాపాంగ్ వరుసగా 95 గంటల పాటు విరామం లేకుండా ఎగురుతూ ఇప్పటికే 4,100 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం అది ఆఫ్రికా ఖండం వైపు వేగంగా దూసుకెళ్తోంది. తమిళనాడు సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు నవంబర్ 21న సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఈ అద్భుత వలస వివరాలను పంచుకున్నారు. అలంగ్ విశ్రాంతి లేకుండా, ఎక్కడా కిందకు దిగకుండా కేవలం అపారమైన సహనంతో అరేబియా సముద్రాన్ని దాటిందని, ఈ రెండు చిన్న పక్షులు ఆకాశంలో అద్భుతమైన ఛాంపియన్లని ఆమె కొనియాడారు. అంతకుముందు నవంబర్ 19న కూడా ఈ పక్షులు తమ పాత వలస మార్గాల్లో మళ్లీ కదలికలు ప్రారంభించాయని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

23 దేశాలు చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన గ్లోబల్ సిటిజన్లు

అముర్ ఫాల్కన్లు డేగ జాతికి చెందిన ప్రత్యేక వలస పక్షులు. నవంబర్ 2025లో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు మణిపూర్ అముర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కింద అపాపాంగ్, అలంగ్ పక్షులకు శాటిలైట్ ట్రాన్స్‌మిటర్లను అమర్చారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు వీటి ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు. ఆఫ్రికా నుంచి ఆసియా వరకు దాదాపు 23 దేశాలను చుట్టి వచ్చిన ఈ రెండు పక్షులు, ఈశాన్య చైనాలోని తమ సంతానోత్పత్తి ప్రాంతం నుంచి 11 రోజుల పాటు ప్రయాణించి గత నెల అక్టోబర్ 22న మణిపూర్‌కు తిరిగి చేరుకున్నాయి. ఆ సమయంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వీటి ఫోటోలను షేర్ చేస్తూ వీటిని గ్లోబల్ సిటిజన్లుగా అభివర్ణించారు.

తామెంగ్లాంగ్‌లో 25 రోజుల విడిది తర్వాత మళ్లీ యాత్ర

మణిపూర్‌లోని తామెంగ్లాంగ్ జిల్లా చియులువాన్ ప్రాంతంలో సుమారు 25 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత, అలంగ్, అపాపాంగ్ మళ్లీ తమ సుదీర్ఘ శీతాకాల వలస యాత్రను ప్రారంభించాయి. మణిపూర్ అముర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ ఫేజ్-2 తాజా ట్రాకింగ్ మ్యాప్ ప్రకారం, అలంగ్ 101 గంటల్లో 5,700 కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియాలో అడుగుపెట్టగా, అపాపాంగ్ ఇంకా ఆకాశంలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పక్షులకు సరిహద్దులు లేవని, ప్రకృతిలో వాటి సహనానికి, పట్టుదలకు ఈ ప్రయాణం ఒక నిదర్శనమని వన్యప్రాణి నిపుణులు ప్రశంసిస్తున్నారు. ప్రతి ఏటా వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ పక్షుల వలస మార్గాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ఈ ట్రాకింగ్ డేటా మరోసారి ప్రపంచానికి చాటిచెబుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us