ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పైథాన్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి!
B.Pharmacy New Syllabus: B.Pharmacy విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. JNTUH ఆమోదించిన ఈ మార్పుల్లో పైథాన్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంటర్న్‌షిప్‌లు, ప్రాక్టికల్ నైపుణ్యాలు, కొత్త ఎలక్టివ్ కోర్సులతో ఫార్మసీ విద్యను మరింత ఉద్యోగోపయోగంగా తీర్చిదిద్దనున్నారు..

హైదరాబాద్, నవంబర్ 22: ఫార్మసీ విద్యార్థులకు కీలకమైన విద్యా మార్పులు రాబోతున్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఫార్మా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బీ ఫార్మసీ (B.Pharmacy) సిలబస్‌లో సమూల మార్పులు చేశారు. ఇప్పటివరకు ప్రధానంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు పరిచయమైన పైథాన్ కోడింగ్‌ను ఇకపై ఫార్మసీ విద్యార్థులు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), డేటా అనాలసిస్ వంటి ఆధునిక అంశాలను కొత్త సిలబస్‌లో చేర్చారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) ప్రతిపాదించిన ఈ సవరించిన సిలబస్‌కు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. మొత్తం క్రెడిట్లను 203 నుంచి 193కి తగ్గించారు.
బట్టి చదువులకు స్వస్తి.. ప్రాక్టికల్ నైపుణ్యాలకు ప్రాధాన్యం
కొత్త సిలబస్‌లో పుస్తకాల్లోని అంశాలను కేవలం కంఠస్థం చేయడానికే కాకుండా, విద్యార్థుల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టారు. ఫార్మసీ విద్యార్థులు సంప్రదాయ మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలకే పరిమితం కాకుండా ఫార్మా డేటా సైన్స్, క్లినికల్ రీసెర్చ్, ఏఐ, డ్రగ్ డిస్కవరీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ అవకాశాలు పొందేలా పాఠ్యాంశాలను రూపొందించారు.
మొదటి ఏడాది నుంచే పైథాన్ కోడింగ్
కొత్త సిలబస్‌లో టెక్నాలజీ సంబంధిత అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. సెమిస్టర్‌ల వారీగా పలు కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టారు.
- సెమిస్టర్ 1: పైథాన్ ప్రోగ్రామింగ్ (Foundation for Computational Thinking) సబ్జెక్టును చేర్చారు. ఇది కంప్యూటేషనల్ థింకింగ్, ఏఐ, డేటా అనాలసిస్ నేర్చుకోవడానికి పునాదిగా ఉపయోగపడుతుంది.
- సెమిస్టర్ 2: డేటా అనాలసిస్, బయోస్టాటిస్టిక్స్ అంశాలను ప్రవేశపెట్టారు.
- సెమిస్టర్ 3: మెషిన్ లెర్నింగ్ (Machine Learning) సబ్జెక్టును చేర్చారు.
- సెమిస్టర్ 6: AI in Pharmaceutical Sciences బోధిస్తారు.
- సెమిస్టర్ 7: AI in Clinical Applications సబ్జెక్టును ప్రవేశపెట్టారు.
- సెమిస్టర్ 8: Ethical AI in Pharmacy అంశాన్ని చేర్చారు.
దీంతో ఫార్మసీ విద్యార్థులకు ఔషధ పరిశోధన, డేటా విశ్లేషణ, క్లినికల్ అప్లికేషన్లలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందనుంది. విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు పరిశ్రమల్లో పనిచేసే అనుభవం ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ఫార్మా ఇండస్ట్రీలు, ఆసుపత్రుల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఒకసారి 120 గంటలు, మరోసారి 240 గంటల పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు పరిశ్రమల పనితీరు, ఔషధ తయారీ, క్లినికల్ ఫార్మసీ తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన లభిస్తుంది. కొత్త సిలబస్‌లో విద్యార్థులకు తమ ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఐదో సెమిస్టర్ నుంచి ఇండస్ట్రియల్ ఫార్మసీ, క్లినికల్ ఫార్మసీ విభాగాల్లో తమకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్, ఫార్మాస్యూటికల్ ఆటోమేషన్, రోబోటిక్ ఫార్మసీ వంటి అంశాలతో కలిపి మొత్తం 30 ఎలక్టివ్ సబ్జెక్టులను అందుబాటులో ఉంచారు. బీ ఫార్మసీ కోర్సులో మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు.
రెండేళ్లు పూర్తి చేస్తే డిప్లొమా అర్హత. మూడేళ్లు పూర్తి చేస్తే అడ్వాన్స్‌డ్ డిప్లొమా. నాలుగేళ్ల కోర్సు పూర్తి చేస్తే బీ ఫార్మసీ డిగ్రీ. ఈ విధానం ద్వారా వివిధ కారణాలతో చదువును మధ్యలో ఆపాల్సి వచ్చిన విద్యార్థులకు కూడా పూర్తిచేసిన విద్యా స్థాయికి అనుగుణంగా అర్హత పొందే అవకాశం కల్పించనున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఫార్మా పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలసిస్ వంటి అంశాలను ఫార్మసీ విద్యలో భాగం చేయడం వల్ల విద్యార్థులకు కొత్త రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కొత్త సిలబస్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తుందని వరంగల్‌లోని సేయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజీకి చెందిన జైపాల్‌రెడ్డి తుమ్మ అభిప్రాయపడ్డారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త సిలబస్‌తో ఫార్మసీ విద్యలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అనుభవం, పరిశోధనా నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యత లభించనుంది.




