AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: ఆలోచనలతో పోరాడటం మానేయండి.. ఈ చిన్న కథలో గొప్ప జీవిత పాఠం తెలుసుకోండి!

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అతిగా ఆలోచించడం (Overthinking) ఒకటి. చిన్న విషయం జరిగినా దాని గురించి గంటల తరబడి ఆలోచించడం, జరగని విషయాలను ముందే ఊహించుకుని భయపడటం, భవిష్యత్తులో ఏమవుతుందోనని ఆందోళన చెందడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. అయితే అతిగా ఆలోచించడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. పైగా మనసు మరింత అలసిపోతుంది. మరి ఈ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి? ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం..

Moral Story: ఆలోచనలతో పోరాడటం మానేయండి.. ఈ చిన్న కథలో గొప్ప జీవిత పాఠం తెలుసుకోండి!
Overthinking Wont Solve Your Problems
Srilakshmi C
|

Updated on: Nov 22, 2026 | 10:27 AM

Share

ఒక చిన్న గ్రామంలో డేనియల్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉండేవాడు. అతని మనసుకు ఒక్క క్షణం కూడా ప్రశాంతత ఉండేది కాదు. చదువుకోవడానికి పుస్తకం తెరిచినా ఏ పాఠం ముందుగా చదవాలి? ఈ సబ్జెక్టు చదవాలా? మరో సబ్జెక్టు చదవాలా? అంటూ ఆలోచనల్లోనే సమయం గడిపేవాడు. ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు వెళ్లేవాడు. చివరకు చదవాల్సిన పని పూర్తయ్యేది కాదు. రాత్రి పడుకున్నా ఇదే పరిస్థితి. గతంలో జరిగిన విషయాలు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోలేకపోయేవాడు. ఇలా రోజురోజుకూ అతిగా ఆలోచించడం వల్ల డేనియల్ మానసికంగా అలసిపోయేవాడు. కొన్ని రోజుల క్రితం ఆ గ్రామానికి ఒక రిటైర్డ్ సైకాలజిస్ట్ వచ్చి నివసించడం ప్రారంభించారు. ఆయన గతంలో పెద్ద నగరంలో ప్రసిద్ధ మనస్తత్వ నిపుణుడిగా పనిచేశారు. వయసు పైబడినా ఎంతో దయగా, ప్రశాంతంగా ఉండేవారు. ఆయనతో మాట్లాడితేనే మనసులోని భారం తగ్గిపోతుందని గ్రామస్తులు చెప్పుకునేవారు.

ఒకరోజు డేనియల్ ఆలోచనల్లో మునిగిపోయి రోడ్డుపై నడుస్తుండగా ఆ వృద్ధుడు కనిపించారు. ధైర్యం తెచ్చుకుని ఆయన దగ్గరకు వెళ్లి తన సమస్యలన్నీ వివరించాడు. చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నానని, మనసులో నిరంతరం ఆలోచనలు వస్తున్నాయని, వాటివల్ల ఎంతో అలసిపోతున్నానని చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న వృద్ధుడు చిన్నగా నవ్వి ఒక సలహా ఇచ్చారు. వృద్ధుడు డేనియల్‌తో ఇలా అన్నారు. ‘ఈరోజు రాత్రి ప్రశాంతంగా కూర్చొని కళ్లు మూసుకో. కానీ ఒక షరతు.. ఆ సమయంలో నువ్వు కోతి గురించి అస్సలు ఆలోచించకూడదు.’ ఆ మాటలు విన్న డేనియల్ ఆశ్చర్యపోయాడు. ‘సార్.. నాకు కోతులకు ఎలాంటి సంబంధం లేదు. నేను వాటి గురించి ఎందుకు ఆలోచిస్తాను?’ అని అడిగాడు. అప్పుడు వృద్ధుడు నవ్వుతూ ‘అయితే ఈరోజు రాత్రి ప్రయత్నించు. కోతి గురించి ఆలోచించకుండా ఉండగలవేమో చూడు’ అని చెప్పారు.

ఆ రాత్రి డేనియల్ కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చున్నాడు. కానీ వెంటనే అతని మనసులో ‘కోతి గురించి ఆలోచించకూడదు’ అనే మాట గుర్తుకొచ్చింది. అంతే.. ఒక్కసారిగా కోతుల చిత్రాలు అతని మనసులో కనిపించడం ప్రారంభించాయి. ఒక కోతి, మరో కోతి.. అవి దూకడం, అరవడం, పరుగెత్తడం ఇలా ఎన్నో దృశ్యాలు గుర్తుకొచ్చాయి. వాటి గురించి ఆలోచించకూడదని ఎంత ప్రయత్నిస్తే అంత ఎక్కువగా అవే గుర్తుకొస్తున్నాయి. చివరకు విసిగిపోయి ఆ ప్రయత్నాన్ని ఆపేశాడు. మరుసటి రోజు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇంతకుముందు ఎప్పుడూ కోతుల గురించి ఆలోచించని తనకు ఇప్పుడు అవే పదేపదే గుర్తుకు వస్తున్నాయని బాధపడ్డాడు. డేనియల్ తిరిగి వృద్ధుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వుతూ అసలు విషయం వివరించారు.

ఇవి కూడా చదవండి

‘డేనియల్.. నేను నీకు ఒక విషయాన్ని అర్థం చేయించాలనుకున్నాను. నువ్వు ఒక ఆలోచనను ఆపాలని ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే, అది అంత బలంగా తిరిగి వస్తుంది. నీ అతిగా ఆలోచించే సమస్య కూడా ఇలాగే పనిచేస్తోంది. మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనతో నువ్వు పోరాడుతున్నావు. కానీ అలా చేయడం వల్ల మనసు మరింత అలసిపోతుంది. ఆలోచనలను బలవంతంగా ఆపడం కంటే వాటిని గమనించడం నేర్చుకోవాలి” అని చెప్పారు. ‘ఒక ఆలోచన వచ్చిందా? సరే.. అది ఒక ఆలోచన మాత్రమే అని గుర్తించు. దాని గురించి భయపడకు. దానితో పోరాడకు’ అని సూచించారు.

వర్తమానంలో జీవించడం నేర్చుకో!

ఆ తర్వాత వృద్ధుడు డేనియల్‌ను ఒక ప్రశ్న అడిగారు. ‘నువ్వు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు? అసలు నీకు ఉన్న అతిపెద్ద భయం ఏమిటి?’ డేనియల్ కాసేపు ఆలోచించి సమాధానమిచ్చాడు. ‘సార్.. నాకు త్వరలో ఒక ముఖ్యమైన పరీక్ష ఉంది. నా భవిష్యత్తు ఆ పరీక్ష ఫలితంపై ఆధారపడి ఉంటుందని భయపడుతున్నాను. పరీక్షలో ఫెయిల్ అయితే ఏమవుతుంది? మంచి మార్కులు వచ్చినా నా జీవితం బాగుంటుందా? అంటూ నిరంతరం ఆలోచిస్తున్నాను’ అని చెప్పాడు. అప్పుడు వృద్ధుడు పక్కనే ఉన్న చెట్టును చూపించారు. గాలి వీయడంతో ఒక ఆకు నెమ్మదిగా నేలపైకి రాలుతోంది. ఆ ఆకును చూస్తూ వృద్ధుడు ఇలా అడిగారు. ‘ఇప్పుడు చెప్పు డేనియల్.. ఈ క్షణంలో నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి?’ డేనియల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ కొన్ని క్షణాల పాటు అతని మనసులో పరీక్షల భయం లేదు. భవిష్యత్తు గురించి ఆందోళన లేదు. కేవలం ఆ ఆకును చూస్తూ ప్రశాంతంగా ఉన్నాడు.

‘సార్.. ఈ కొద్ది క్షణాలు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇలాగే ఎప్పుడూ ఉండాలని అనిపిస్తోంది’ అని చెప్పాడు. అప్పుడు వృద్ధుడు ఒక గొప్ప విషయాన్ని వివరించారు. ‘నువ్వు అతిగా ఆలోచిస్తున్నప్పుడు నీ తలలోనే జీవిస్తున్నావు. ఒక ఆలోచన వస్తుంది. దానికి మరో ఆలోచన జతచేస్తావు. ఇలా జరిగితే ఏమవుతుంది? అలా జరిగితే ఏమవుతుంది? అంటూ ఊహించుకుంటూ ఉంటావు. కానీ నీ ఆలోచనలకు బయట కూడా ఒక జీవితం ఉంది. ఆ జీవితం వర్తమానంలోనే ఉంటుంది. గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం వల్ల ప్రస్తుత క్షణాన్ని కోల్పోతున్నావు” అని చెప్పారు.

అతిగా ఆలోచించడం తగ్గించుకోవడానికి 3 మార్గాలు!

వృద్ధుడు డేనియల్‌కు మూడు ముఖ్యమైన విషయాలు చెప్పారు. అవి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడతాయి.

ఆలోచనలతో పోరాడకండి

మనసులోకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకండి. ఆ ఆలోచనను గమనించండి. ‘నా మనసులో ఒక ఆలోచన వచ్చింది’ అని గుర్తించండి. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ పనిపై దృష్టి పెట్టండి.

వెంటనే వర్తమానంలోకి రండి

గతంలో జరిగిన విషయాల గురించి లేదా భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఆలోచిస్తూ ఉండకుండా మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. ప్రకృతిని చూడండి. ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి.

సమస్యలను కాగితంపై రాయండి

మీకు ఆందోళన కలిగిస్తున్న విషయాలను ఒక పేపర్‌పై రాయండి. ఆ తర్వాత ఆ సమస్య మీ నియంత్రణలో ఉందా? లేదా? అని ప్రశ్నించుకోండి. మీ నియంత్రణలో ఉంటే దానికి పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించండి. మీ నియంత్రణలో లేకపోతే దాని గురించి పదేపదే ఆలోచిస్తూ మీ ప్రశాంతతను కోల్పోకండి. ఈ మూడు అలవాట్లు ఆలోచనలను అర్థం చేసుకోవడానికి, వాటి వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడతాయి.

వృద్ధుడి మాటలు డేనియల్ మనసును తాకాయి. తన సమస్యలకు కారణం కేవలం ఆలోచనలు రావడం కాదని, వాటితో నిరంతరం పోరాడుతూ ఉండటమేనని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి తన ఆలోచనలను గమనించడం, వర్తమానంలో జీవించడం, సమస్యలకు పరిష్కారాలు వెతకడంపై దృష్టి పెట్టాడు. గుర్తుంచుకోండి.. మీ ఆలోచనలే మీ జీవితం కాదు. మీరు ప్రతిరోజూ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. జీవితాన్ని ఆలోచిస్తూ గడిపేయకండి.. జీవితాన్ని అనుభవించండి. సమస్యల గురించి మాత్రమే ఆలోచించకుండా, వాటికి పరిష్కారాల కోసం అడుగులు వేయండి. ఎందుకంటే ప్రశాంతత అనేది భవిష్యత్తులో దొరికేది కాదు.. ఈ క్షణాన్ని సరిగ్గా జీవించడం ద్వారా పొందేది!

Follow Us
అతిగా ఆలోచిస్తున్నారా? ఈ చిన్న కథలో గొప్ప జీవిత పాఠం తెలుసుకోండి!
అతిగా ఆలోచిస్తున్నారా? ఈ చిన్న కథలో గొప్ప జీవిత పాఠం తెలుసుకోండి!
ఎలక్ట్రిక్ కెటిల్ లోపల తెల్లటి మరకలు పేరుకుపోయాయా? కొత్తదానిలా
ఎలక్ట్రిక్ కెటిల్ లోపల తెల్లటి మరకలు పేరుకుపోయాయా? కొత్తదానిలా
ఆరుగురు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిన ఆముదం గింజలు!
ఆరుగురు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిన ఆముదం గింజలు!
పాక్‎తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కలిసొచ్చే అంశాలివే
పాక్‎తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కలిసొచ్చే అంశాలివే
బజాజ్ సరికొత్త స్పోర్ట్స్ బైక్ "పల్సర్ RS200" వచ్చేసింది..!
బజాజ్ సరికొత్త స్పోర్ట్స్ బైక్
వాళ్లకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు: కీర్తిసురేష్
వాళ్లకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు: కీర్తిసురేష్
భారత్ నుంచి నేపాల్‌కు వందే భారత్ ట్రైన్.. ముహూర్తం ఫిక్స్..
భారత్ నుంచి నేపాల్‌కు వందే భారత్ ట్రైన్.. ముహూర్తం ఫిక్స్..
జడ్జికి బదులు ఒవైసీకి సెల్యూట్..పోలీసుల ప్రోటోకాల్ మిస్టేక్!
జడ్జికి బదులు ఒవైసీకి సెల్యూట్..పోలీసుల ప్రోటోకాల్ మిస్టేక్!
వాహనాలు ఆపి డబ్బులు వసూలు.. చివరకు అడ్డంగా బుక్కయ్యారు!
వాహనాలు ఆపి డబ్బులు వసూలు.. చివరకు అడ్డంగా బుక్కయ్యారు!
మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈరోజే ఇది చదవండి.. !
మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈరోజే ఇది చదవండి.. !