లీటర్ పాలతో దూదిలాంటి మెత్తటి పనీర్.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
శాకాహారులకు ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్ పనీర్. కూరలే కాదు, రకరకాల స్నాక్స్‌లోనూ పనీర్ రుచి అదుర్స్ అనిపిస్తుంది. అయితే బయట మార్కెట్లో దొరికే పనీర్‌లో కల్తీ కలవడంతో ఆరోగ్యసమస్యలు వచ్చే అవకావాలు ఉన్నాయి. అలాంటి కల్తీకి చెక్ పెడుతూ.. కేవలం గంటలోపే ఇంట్లోనే అచ్చం బయట దొరికేంత మెత్తటి, స్పాంజీ పనీర్‌ను ఎలా చేసుకోవాలో తెలుసా? ప్రముఖ చెఫ్ నిషా మధులిక చెప్పిన ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే పనీర్ ఎప్పుడూ పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.

శాకాహారులకు ప్రోటీన్ అనగానే మొదట గుర్తొచ్చేది పనీర్. కూరల నుంచి స్నాక్స్ వరకు పనీర్‌తో రకరకాల వంటకాలు చేస్తుంటాం. అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే పనీర్‌లో కల్తీ ఎక్కువగా ఉంటోంది. ఆరోగ్యానికి హాని చేసే నకిలీ పనీర్‌ను కొనే బదులు, కేవలం 1 నుంచి 2 గంటల్లోనే ఇంట్లోనే స్వచ్ఛమైన, మెత్తటి పనీర్‌ను తయారు చేసుకోవచ్చు. ప్రముఖ యూట్యూబ్ చెఫ్ నిషా మధులిక పంచుకున్న ఈ సింపుల్ ట్రిక్‌తో అచ్చం డైరీలో దొరికే స్పాంజీ పనీర్‌ను మీరు కూడా సులభంగా చేసుకోవచ్చు. మీరు 2 లీటర్ల ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే దాదాపు 400 గ్రాముల పనీర్ వస్తుంది. అదే 1 లీటరు పాలైతే 200 గ్రాముల పనీర్ సిద్ధమవుతుంది. ముందుగా ఒక గిన్నెలో పాలను పోసి మరిగించాలి. పాలు కొద్దిగా చిక్కబడే వరకు సన్నని మంటపై ఉడికించాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత వెంటనే మంటను ఆర్పకూడదు.
పాలు విరగ్గొట్టేటప్పుడు ఈ తప్పు చేయకండి
చాలామంది మరుగుతున్న పాలలో నేరుగా నిమ్మరసం లేదా వెనిగర్ పోస్తుంటారు. ఇలా చేయడం వల్ల పనీర్ గట్టిగా, గరుకుగా మారుతుంది. మెత్తటి పనీర్ రావాలంటే.. పాలను కాసేపు మరిగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో 3 టీస్పూన్ల నిమ్మరసం తీసుకుని, దానికి 6 టీస్పూన్ల నీళ్లు కలిపి పల్చగా చేయాలి. ఈ నిమ్మరసం నీటిని పాలలో కొద్దికొద్దిగా పోస్తూ చెంచాతో నెమ్మదిగా కలపాలి. అప్పుడు పాలు మృదువుగా విరిగి పనీర్ వేరవుతుంది.
వడకట్టి, నీటిని తీసే విధానం
ఇప్పుడు ఒక గిన్నెపై జల్లెడ పెట్టి, దానిపై శుభ్రమైన కాటన్ లేదా మస్లిన్ క్లాత్ వేయాలి. విరిగిన పాలను అందులో పోసి నీటిని వడకట్టాలి. గుడ్డలో మిగిలిన పనీర్‌పై కొద్దిగా చల్లటి నీళ్లు పోసి రెండుసార్లు కడగాలి. దీనివల్ల పనీర్‌లో ఉన్న నిమ్మకాయ పులుపు పూర్తిగా పోతుంది. అనంతరం ఆ గుడ్డను గట్టిగా పిండి, మూటలా కట్టి 15 నిమిషాల పాటు అలానే వదిలేయాలి.
స్పాంజీలా మారాలంటే ఇలా చేయండి
చివరగా ఒక వెడల్పాటి ప్లేట్ లేదా పాన్‌ను బోర్లా పెట్టి, దానిపై పనీర్ మూటను ఉంచాలి. దానిపైన మరీ బరువుగా కాకుండా, మరీ తేలికగా కాకుండా ఉండే ఒక చపాతీ కర్ర లేదా చిన్న బరువును 30 నుంచి 35 నిమిషాల పాటు ఉంచాలి. అరగంట తర్వాత తీసి చూస్తే మెత్తటి, స్పాంజీ పనీర్ సిద్ధంగా ఉంటుంది. దీనిని ముక్కలుగా కట్ చేసుకుని వెంటనే వంటకు వాడుకోవచ్చు లేదా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
