AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వికారాబాద్ జిల్లాలో తీవ్రవిషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం !!

తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి ఘాట్ రోడ్డులోని బుగ్గరామేశ్వరం సమీపంలో ఓ మలుపు వద్ద ఆటో-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతులను పెండ్లిమడుగు గ్రామానికి చెందిన చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత, నాగేష్‌గా పోలీసులు గుర్తించారు.

వికారాబాద్ జిల్లాలో తీవ్రవిషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం !!
Road Accident At Vikarabad
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 22, 2026 | 11:12 AM

Share

వికారాబాద్ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామం నుండి కేరెల్లి గ్రామానికి ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. బుగ్గ రామేశ్వరం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు.

ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు. మృతులను ఆటో డ్రైవర్ నాగేష్, కుటుంబ సభ్యులు చంద్రమ్మ, పార్వతమ్మ, మరియు సరితగా పోలీసులు గుర్తించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో బయలుదేరిన వీరు, మరికొద్ది సేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా మృత్యువాత పడటం పెండ్లిమడుగు గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. ఒకే ఇంటి నుండి నలుగురు విగతజీవులుగా మారడంతో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మలుపు వద్ద అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబాన్ని బలిగొన్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Follow Us