AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరాల్లో కార్ల కంటే నడిచే వారే ఎక్కువ.. అయినా ఫుట్‌పాత్‌లు ఎందుకు లేవు? అసలు లెక్కలు తెలిస్తే షాక్!

భారత నగరాల్లో వాహనాల కంటే నడిచే ప్రయాణికులే ఎక్కువగా ఉన్నప్పటికీ, రోడ్ల నిర్మాణంలో వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఫుట్‌పాత్‌ల కొరత, బస్సుల సంఖ్య తక్కువగా ఉండటం, మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యలు పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పట్టణ రవాణా ప్రణాళికల్లో నడకకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

నగరాల్లో కార్ల కంటే నడిచే వారే ఎక్కువ.. అయినా ఫుట్‌పాత్‌లు ఎందుకు లేవు? అసలు లెక్కలు తెలిస్తే షాక్!
Pedestrian Safety India
Santosh Nair
| Edited By: |

Updated on: Nov 22, 2026 | 11:07 AM

Share

లత ఓ నగర ఆసుపత్రిలో ఫ్లోర్ క్లీనర్‌గా పనిచేస్తుంది. ఆమె రోజు నడకతోనే మొదలవుతుంది. తెల్లవారుజామున ఐదు గంటలకు తన ఒక్క గది ఇంటి నుంచి బయలుదేరి, ఫుట్‌పాత్ లేని రోడ్డు దాటి, అడ్డంగా పార్క్ చేసిన కార్లను, నిర్మాణ ఇసుక కుప్పలను తప్పించుకుంటూ ముందుకెళ్తుంది. సిగ్నల్ లేని కూడలి వద్ద పది నిమిషాలు వేచి చూసి, నీడనిచ్చే షెల్టర్ కూడా లేని బస్ స్టాప్ వరకు మరో ఇరవై నిమిషాలు నడుస్తుంది. బస్సు ఎప్పుడో వస్తుంది, వచ్చినా కిక్కిరిసి ఉంటుంది. ఆసుపత్రికి చేరాక సాయంత్రం ఆరు గంటల వరకు పొడవాటి కారిడార్లలో మళ్లీ నడకే! “పనికి ఎలా వెళ్తావు?” అని ఎవరైనా అడిగితే ఆమె “బస్సులో” అని చెబుతుంది.. కానీ ఆ ప్రయాణంలో ఆమె నడిచిన నలభై నిమిషాలను ఎవరూ లెక్కలోకి తీసుకోరు.

భారతదేశ నగరాల వెనుక ఉన్న చిన్న రహస్యం ఇదే.. మనం నగరాలను కారు నడిపే వారి కోసం ప్లాన్ చేస్తాము, కానీ వాటిలో జీవించేది మాత్రం నడిచే మనుషులే! ఏ కూడలిలోనైనా ఒక నిమిషం ఆగి వెళ్లే వాటిని లెక్కించండి—కార్లు, స్కూటర్లు, బస్సులు, ఆటోలు, కొన్ని సైకిళ్లు, వాటి మధ్యలో అత్యధికంగా కనిపించేవి మనుషుల పాదాలే. వాహనాలను కాకుండా ప్రయాణాలను (Trips) లెక్కిస్తే మన రోడ్లు ఎప్పుడూ చెప్పని అసలు నిజం బయటపడుతుంది.. నగరాల్లో ఎక్కువ మంది నడిచే ప్రయాణిస్తున్నారు.

నడిచే వారే ఎక్కువ.. కానీ నిధులు ఎటు వెళ్తున్నాయి?

అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) సేకరించిన అధ్యయనాల ప్రకారం, నగరాల పరిమాణాన్ని బట్టి ప్రయాణాల తీరు ఇలా ఉంది:

నగర పరిమాణం నడక ద్వారా జరిగే ప్రయాణాలు కార్లు & ద్విచక్ర వాహనాల వాటా
కోటికి పైగా జనాభా ఉన్న మెట్రో నగరాలు 43% 15%
10 లక్షల నుంచి కోటి జనాభా గల నగరాలు 37% 26%
చిన్న నగరాలు 49% (దాదాపు సగం) తక్కువ శాతం

మరో విశ్లేషణ ప్రకారం, పట్టణ ప్రయాణాల్లో నడక, సైక్లింగ్ వాటా కలిపి సుమారు 40% ఉంది. ఏ నగరంలో చూసినా డ్రైవర్ల కంటే నడిచే వారే అధికంగా ఉన్నారు. అలాంటప్పుడు రోడ్లను ఎవరి కోసం నిర్మిస్తున్నట్లు? వాహనాల కోసం వెడల్పాటి లేన్లు వేస్తున్నారు కానీ, ఫుట్‌పాత్‌లు పగిలిపోయి, పార్కింగ్ చేసిన కార్లతో నిండిపోయి లేదా అసలు లేకుండానే ఉంటున్నాయి. పట్టణ రవాణా బడ్జెట్‌లో నడక, సైక్లింగ్ సదుపాయాలకు 5% కంటే తక్కువ నిధులే వెళ్తున్నాయని ఒక అంచనా. సగం ప్రయాణాలకు ఆధారమైన రంగానికి ఇంత తక్కువ కేటాయింపులు ఉండటం విస్మయపరిచే అంశం.

బస్సుల కొరత – మెట్రో ‘లాస్ట్ మైల్’ సవాలు:

సామాన్య ఉద్యోగి వాహనమైన బస్సు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు 40 నుంచి 60 బస్సులు ఉండాలి. కానీ ORF గణాంకాల ప్రకారం బెంగళూరు (45) మాత్రమే ఈ కనీస ప్రమాణాన్ని అందుకుంది. హైదరాబాద్, చెన్నైలలో 31 చొప్పున, ముంబైలో 28 బస్సులు ఉండగా; జైపూర్ (10), నాగ్‌పూర్ (8), లక్నో (7) నగరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లక్ష మందికి ఏడు బస్సులు ఉన్న చోట బస్ స్టాప్‌లో నిరీక్షణ అనేది చిన్న అసౌకర్యం కాదు—ఆసుపత్రి కార్మికురాలు, షాప్ అసిస్టెంట్, విద్యార్థి తమ ఉద్యోగం లేదా చదువు కోసం రోజూ చెల్లించే మూల్యం అది!

మరోవైపు మెట్రో రైళ్ల నిర్మాణం గొప్ప విజయమే అయినప్పటికీ, అంచనా వేసిన ప్రయాణికుల సంఖ్యకు, వాస్తవ ప్రయాణికులకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ముంబై తొలి లైన్ అంచనాల్లో 75% చేరుకోగా, హైదరాబాద్ 26%, కాన్పూర్ కేవలం 2% వద్దే నిలిచాయి. (ఈ లెక్కలు కరోనా మహమ్మారి ప్రభావం ఉన్న కాలానికి సంబంధించినవి కావడంతో వ్యత్యాసం కొంత ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ధోరణిని విస్మరించలేము).

మెట్రో స్టేషన్‌కు సురక్షితంగా నడిచి వెళ్లే వీలుండి, దిగిన తర్వాత గమ్యస్థానానికి నడిచి వెళ్లే ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ బాగున్నప్పుడే మెట్రో ఉపయోగపడుతుంది. స్టేషన్ నుంచి ఆఫీసుకు వెళ్లే దారిలో ఫుట్‌పాత్ లేక అరగంట పాటు ప్రమాదకరంగా నడవాల్సి వస్తే, ఇరవై నిమిషాల్లో నగరాన్ని దాటించే రైలు ఉన్నా ప్రయోజనం ఉండదు. ప్రతి ప్రయాణం ఎక్కడ మొదలైనా, చివరికి ముగిసేది మాత్రం నడకతోనే!

ఇది కేవలం సౌకర్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రాణాలకు సంబంధించిన సమస్య. కేవలం కార్ల చుట్టూ నిర్మించే నగరాలు త్వరలోనే ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతాయి. పైగా ఎక్కువగా నడిచే పేదలు, వృద్ధులు, మహిళలు, చిన్నారులే అత్యధిక ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. కేంద్ర రవాణా శాఖ 2023 నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రతి ఐదుగురు రోడ్డు మృతుల్లో ఒకరు పాదచారులే!

లతకు ఈ అంకెలేవీ తెలియవు.. తన ఇంటి నుంచి బస్ స్టాప్‌కు వెళ్లే దారి కనిపించే దానికంటే చాలా పొడవైనదని, కష్టమైనదని మాత్రమే ఆమెకు తెలుసు.

మీ నగరం తన తదుపరి రోడ్డును ప్లాన్ చేస్తున్నప్పుడు— ఆ రోడ్డు ఎవరిని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తోంది? అనేది ఆలోచించండి..

Follow Us