Hyderabad: మలక్‌పేటలో జింక మాంసం కలకలం.. క్రూర వేటగాళ్లు అరెస్ట్..
హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం రేపింది. జింక మాంసాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీళ్లను క్రూర వేటగాళ్లుగా గుర్తించారు. అడవుల్లో మారణాయుధాలతో జింకలను వేటాడుతున్నట్లు విచారణలో తేలింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి టెలిస్కోప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న జింక మాంసం కలకలం సృష్టించింది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో పట్టుబడగా.. వారి వాహనాన్ని సోదా చేశారు. దీంతో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల కారులో భారీగా జింక మాంసంతో పాటు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు, వేటకు సంబంధించిన అత్యాధునిక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ జంతువుల అక్రమ రవాణా, వేటపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల విచారణలో నిందితులను సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మరియు మహ్మద్ హమీద్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు సాధారణ వేటగాళ్లు కాదని, పక్కా ప్రణాళికతో అక్రమ వేట సాగిస్తున్న ముఠా అని తేలింది. కర్ణాటకలోని కలబురగి జిల్లా దట్టమైన అటవీ ప్రాంతానికి ఈ ముగ్గురూ ప్రత్యేకంగా కారులో వెళ్లి జింకలను వేటాడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. అక్కడ వారు సుమారు 12 రౌండ్ల పాటు తుపాకీతో కాల్పులు జరిపి అమాయక మూగజీవాలను హతమార్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఆపరేషన్‌లో నిందితుల నుంచి స్కార్పియో కారుతో పాటు ఒక రైఫిల్, 8 సజీవ బుల్లెట్లు, 12 ఖాళీ కాట్రిడ్జ్‌లు, రెండు నైట్ విజన్ టెలిస్కోప్‌లు, ఒక ప్రత్యేక బ్యాటరీ, నాలుగు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయాల్లో జంతువులను సులభంగా గుర్తించి వేటాడేందుకు వీరు ఈ అత్యాధునిక టెలిస్కోప్‌లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ నెట్‌వర్క్‌తో ముడిపడిన ఇతర వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
