ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.. చివరకు కోర్టు సంచలన తీర్పు!
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన వ్యక్తికి విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష విధించింది. 2020లో నమోదైన కేసులో గనిశెట్టి త్రినాథ్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. జైలు శిక్ష జరిమానా విధించింది కోర్టు. ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2020వ సంవత్సరంలో నమోదైన కేసులో సంచలన తీర్పు చెప్పింది న్యాయస్థానం.. వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన గనిశెట్టి త్రినాథ్.. 2020వ సంవత్సరంలో యలమంచిలి మండలంలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. కుల, ఆర్థిక అంతరాలు ఉన్నాయని యువతి నిరాకరించింది. అయినా.. వెంటపడ్డాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను లోబర్చుకున్నాడు.
ప్రేమిస్తున్న తనను పెళ్లి చేసుకోవాలని యువతి.. త్రినాధ్ ను కోరింది. అతను నిరాకరించడంతో ఒత్తిడి చేసింది. దీంతో మొహం చాటేసాడు త్రినాథ్. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
అప్పట్లో నర్సీపట్నం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వర్తించిన ప్రస్తుత జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.. ఈ కేసులో స్వయంగా దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. నిందితుడిని అప్పట్లో అరెస్ట్ చేయడంతో పాటు శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పక్కాగా సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
విచారణ అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన విశాఖపట్నం ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం, నిందితుడు గనిశెట్టి త్రినాథ్‌ను దోషిగా తేల్చింది. నిందితుడికి ఏడాది జైలు శిక్ష, 20వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ కేసులో నేరస్తుడికి శిక్ష పడేలా కోర్టులో బలమైన వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.మీనా, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఎస్.రాయవరం పోలీసులు, సీఎంఎస్ పోలీసు సిబ్బందిని విచారణాధికారి, జిల్లా ఎస్పీ శ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
