AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్‌లో సగటు ఇంటి విలువ ఎంతో తెలుసా..?

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇళ్ల అమ్మకాలు 13% తగ్గినప్పటికీ, మొత్తం విక్రయ విలువ రూ. 52,913 కోట్లకు చేరి, సగటు ఇంటి విలువ రూ. 2.03 కోట్లకు పెరిగింది. కొత్త ఇళ్ల లాంచ్‌లు రికార్డు స్థాయిలో పెరిగి, అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. అయినా ధరలు మాత్రం అధికంగానే ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో కార్యాలయ స్థలాలు డిమాండ్‌ను పెంచనున్నాయి.

Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్‌లో సగటు ఇంటి విలువ ఎంతో తెలుసా..?
Hyderabad Homes
Ram Naramaneni
|

Updated on: Oct 20, 2026 | 9:00 PM

Share

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం అటు ఆశ, ఇటు నిరాశల మధ్య ఊగిసలాడుతోంది. లెక్కలు విభిన్న ధోరణులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒకవైపు ఇళ్ల అమ్మకాలు 13% తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 26,068 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే భారీ తగ్గుదల. అయినప్పటికీ, మార్కెట్ మొత్తం విక్రయ విలువ తగ్గకపోవడం గమనార్హం. విక్రయ విలువ పరంగా హైదరాబాద్ దేశంలో మూడో అతిపెద్ద హౌసింగ్ మార్కెట్‌గా నిలిచింది. మొదటి ఆరు నెలల్లో ఇళ్ల విక్రయాల మొత్తం విలువ రూ.52,913 కోట్లకు చేరుకుంది. ఈ విచిత్ర పరిస్థితికి ప్రధాన కారణం సగటు ఇంటి విలువ అనూహ్యంగా పెరగడమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో సగటు ఇంటి విలువ రూ.2.03 కోట్లకు చేరింది.

క్రెడాయి హైదరాబాద్ లెక్కల ప్రకారం, నగరంలో దాదాపు 60 మిలియన్ చదరపు అడుగుల రెసిడెన్షియల్ ఏరియా అమ్ముడైంది, ఇది ప్రధాన భారతీయ మార్కెట్లలోకెల్లా అత్యధికం. అమ్ముడైన ఇంటి సగటు పరిమాణం సుమారు 2,300 చదరపు అడుగులు ఉండటాన్ని బట్టి చూస్తే, సిటీలో పెద్ద పరిమాణం, అధిక విలువ కలిగిన ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇళ్ల అమ్మకాలు తగ్గుతున్నప్పటికీ, డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను భారీగా మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. మొదటి ఆరు నెలల్లో హైదరాబాద్‌లో 49,656 ఇళ్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 37% వృద్ధి. ఆరు నెలల్లో అమ్ముడైన ఇళ్ల సంఖ్య కంటే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఇళ్ల సంఖ్య దాదాపు రెండింతలకు చేరడంతో అమ్ముడుపోని ఇళ్ల (అన్‌సోల్డ్ ఇన్వెంటరీ) సంఖ్య కూడా పెరిగింది. అమ్ముడుపోని ఇళ్లలో కేవలం 21% మాత్రమే పూర్తయ్యాయి. దాదాపు 59,400 యూనిట్లు 2027-28 నాటికి పూర్తవుతాయి, మరో 53,800 యూనిట్లు 2029 లేదా ఆ తర్వాత పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అమ్ముడుపోని ఇళ్లలో దాదాపు 80% ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నట్లు అంచనా. 2027-29 మధ్య పెద్ద మొత్తంలో ఇళ్లు పూర్తయిన తర్వాతే ధరలు, అమ్మకాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నగరం నార్త్ వెస్ట్ ప్రాంతం ఇప్పటికీ హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. గత ఆరు నెలల్లో నగరంలోని మొత్తం ఇళ్ల విక్రయ విలువలో 73% వాటా ఈ ప్రాంతానిదే. అయితే, గత ఏడాదితో పోలిస్తే 6% తగ్గుదల నమోదైంది. గతంలో నార్త్ వెస్ట్ లో అధిక కొనుగోళ్లు నమోదవుతుండగా, క్రమంగా ఈ ధోరణి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది.

సౌత్ వెస్ట్ హైదరాబాద్ మార్కెట్ కూడా వేగంగా ఎదుగుతోంది. నాలుగేళ్ల క్రితం 10% ఉన్న సౌత్ వెస్ట్ వాటా ఇప్పుడు 17% కి పెరిగింది. ఈశాన్య హైదరాబాద్ మార్కెట్ తక్కువ, మధ్యస్థ ధరల ఇళ్లకు అనుకూలంగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తుపై కార్యాలయ స్థలాల ప్రభావం కీలకంగా ఉండనుంది. నగరంలో ప్రస్తుతం సుమారు 170 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఉంది. మరో 103 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం నిర్మాణ దశలో ఉంది. ఇది పూర్తయితే మొత్తం 270 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల కొత్త కార్యాలయాలు, ఉద్యోగాలు పెరిగి, రాబోయే ఐదేళ్లలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని క్రెడాయి హైదరాబాద్ నివేదిక అంచనా వేస్తోంది.

Follow Us