నరాల బలహీనత తగ్గి.. శరీరం మరింత బలంగా మారిపోద్ది.. నెలకు ఒక్కసారన్న తినండి..
రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో పాతకాలం నుంచి వస్తున్న సంప్రదాయ వంటకాల్లో వట్టి తునకల కూరకు ప్రత్యేక స్థానం ఉంది. మటన్ ముక్కలకు ఉప్పు, పసుపు రాసి ఎండబెట్టి నిల్వ చేసుకునే విధానం ఇందులో ప్రత్యేకత. ఆ తునకలతో ఉల్లిపాయ, టమాటా, మసాలాలతో కమ్మని కూరను ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకోండి.

రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోని ప్రతి ఇంటిలోనూ కనిపించే సాంప్రదాయ వంటకాల్లో వట్టి తునకల కూర ఒకటి.. ఇది కేవలం ఒక రుచికరమైన భోజనం మాత్రమే కాదు, ఒక చారిత్రక పరిరక్షణ పద్ధతి.. పోషక విలువలతో కూడిన ఆహారం. మటన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటికి ఉప్పు పసుపు రాసి, నాలుగైదు రోజులు ఎండలో ఆరబెట్టడం ద్వారా ఈ వట్టి తునకలను తయారుచేస్తారు. ఈ ప్రక్రియ వల్ల మటన్ సంవత్సరం పొడవునా చెడిపోకుండా నిల్వ ఉంటుంది.
చారిత్రక ప్రాముఖ్యత – ప్రయోజనాలు:
గతంలో, తాజా మటన్ ఎప్పుడూ అందుబాటులో ఉండేది కాదు. అటువంటి సమయంలో, వట్టి తునకలు కుటుంబాలకు, ముఖ్యంగా బాలింతలకు గొప్ప వరంలా ఉండేవి. మటన్ తింటే బాలింతలకు పాలు బాగా పడతాయని, అది శిశువు ఆరోగ్యానికి మంచిదని పెద్దల నమ్మకం. ఈ వట్టి తునకలు ఆరు నెలల పాటు నిల్వ ఉంటాయి కాబట్టి, బాలింతలకు నిరంతరం పోషకాహారం అందించడానికి ఇవి బాగా ఉపయోగపడేవి. ఈ ఆనవాయితీ ఇప్పటికీ అనేక గ్రామాల్లో కొనసాగుతోంది, దీనివల్ల వట్టి తునకల కూర ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది.
వట్టి తునకలు (ఎండబెట్టిన మటన్ ముక్కలు) శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఖనిజాలను సమృద్ధిగా అందిస్తాయి. ప్రోటీన్, ఐరన్, జింక్ తోపాటు.. విటమిన్ B12, క్యాల్షియం, ఫాస్పరస్ కూడా ఉన్నాయి.. ఇవి.. కండరాల నిర్మాణానికి, శరీర బలానికి, రక్త వృద్ధికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.. అంతేకాకుండా.. నరాల బలహీనతను తగ్గించి, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.. అలాగే.. ఎముకల పుష్టికి, దృఢత్వానికి తోడ్పడతాయి
వట్టి తునకల కూర తయారీ విధానం:
ఈ కమ్మని కూరను తయారుచేయడానికి కొన్ని సులభమైన దశలు ఉన్నాయి.
తునకలను సిద్ధం చేయడం: ముందుగా, వట్టి తునకలను శుభ్రం చేసి, ఒక అరగంట సేపు వేడి నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి మెత్తబడి, వంట చేసేటప్పుడు త్వరగా ఉడుకుతాయి.
వేయించడం: స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి, సరిపడా నూనె వేయాలి. నూనె వేడెక్కాక, నానబెట్టిన వట్టి తునకలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది.
మసాలా తయారీ: అదే నూనెలో, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి, పచ్చి వాసన పోయే వరకూ మీడియం ఫ్లేమ్‌లో రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్: తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి, పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించాలి.
టమాటాలు చేర్చడం: నాలుగు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. కావాలంటే టమాటాలు లేకుండా కేవలం ఉల్లిపాయతో కూడా ఈ కూరను చేసుకోవచ్చు. టమాటా వేయడం వల్ల కూరకు మరింత రుచి వస్తుంది. టమాటా ముక్కలు వేసాక, కొద్దిగా ఉప్పు వేసి, మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి.
కారం – తునకలు కలపడం: టమాటాలు మగ్గిన తర్వాత, కూరకు తగినంత కారం వేయాలి. ఈ కూరకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. రెండు స్పూన్ల వరకు కారం వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న వట్టి తునకలను కూడా వేసి, టమాటా మిశ్రమం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి.
ఉడికించడం: ఇప్పుడు, ఒక చిన్న గ్లాసు నీళ్లు పోయాలి. ముక్కలు మరింత మెత్తగా ఉడకడానికి నీళ్లు తప్పనిసరి.
చివరగా, కొద్దిగా ధనియాల పొడి, తరిగిన కొత్తిమీర వేసి, మూత పెట్టి పది నిమిషాలు సిమ్ లో ఉడికించుకోవాలి.
ఈ విధంగా తయారుచేసుకున్న కమ్మని వట్టి తునకల కూర వేడి వేడి అన్నంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సాంప్రదాయ వంటకాన్ని రుచి చూడటం ద్వారా మన పూర్వీకుల ఆహార సంస్కృతిని, వారి తెలివైన పరిరక్షణ పద్ధతులను గుర్తు చేసుకున్నట్లే అవుతుంది. అయితే.. ఏమైనా సమస్యలుంటే.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
